‘ఎన్నికల’ బదిలీలు
మొదటి సారిగా ఎంపీడీఓలకు వర్తింపు
మార్గదర్శకాలు జారీచేసిన జీఏడీ
జిల్లా పరిషత్, న్యూస్‌లైన్ : రానున్న లోక్‌సభ ఎన్నికల విధులు నిర్వహించనున్న అధికారులు జిల్లాలో మూడేళ్లపాటు సర్వీసు పూర్తి చేస్తే తప్పనిసరిగా ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ప్రభుత్వ ఎన్నికల విభాగం స్థానిక ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సాధారణంగా ఎన్నికల విధుల్లో రెవెన్యూ అధికారులకు ప్రత్యక్షంగా ప్రమేయం ఉంటున్నందున వారిని మాత్రమే బదిలీ చేసే వారు.
గడిచిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారులు, సహాయ జిల్లా ఎన్నికల అధికారులు, ఆర్వోలు, ఏఆర్వోలు, అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, బ్లాక్ డెవలప్మెంట్ అధికారులను బదిలీ చేయాలని కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎంపీడీఓల సంఘం నాయకులు తమకు ఎన్నికల విధులకు ప్రత్యక్ష సంబంధాలు ఉండవని, బదిలీల్లో మినహాయించాలని కోరడంతో మినహాయింపు లభించింది.
ఈసారి ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా విధుల్లోకి తీసుకుంటామని రిజర్వులో పెట్టుకున్న అధికారులను సైతం బదిలీ చేయాల్సిందేనని ఈనెల 20న సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో బ్లాక్ డెవలప్మెంట్ అధికారులు లేనందున మండల పరిషత్ అభివృద్ధి అధికారుల పేరును చేర్చడంతో బదిలీలు తప్పవని తెలుస్తోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన ఎంపీడీఓలు ఉంటే మూడేళ్ల సర్వీసు దాటితే బదిలీ చేయాలని నిబంధనల్లో పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా... జిల్లాలోని 50 మండలాలకు ఆరు మండలాల్లో ఎంపీడీఓలు లేరు. మిగతా 44 మండలాల్లో సుమారు 22 మంది ఎంపీడీఓలు మూడేళ్ల నుంచి ఆరేళ్ల వరకు ఒకే చోట పనిచేస్తున్నారు. జనవరి 31న ఆత్మకూరు ఎంపీడీఓ పదవీ విరమణ పొందుతుండడంతో ఖాళీ కానుంది. ఖాళీగా ఉన్న ఆరు మండలాల్లో మూడింటికి సూపరింటెండెంట్లు ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తుండగా మిగతా మూడింటికి పక్క మండలాల ఎంపీడీఓలు బాధ్యతలు చూసుకుంటున్నారు.
ఈ బదిలీ ప్రక్రియను ఫిబ్రవరి 10 వరకు పూర్తి చేసి 15వ తేదీలోగా కమిషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. బదిలీ జరిగే తేదీకి కాకుండా 2014 మే 31 వరకు మూడేళ్లు పూర్తయినా సరే బదిలీ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చిట్యాల, రాయపర్తి, నర్సింహులపేట, నెల్లికుదురు మండలాలకు ఇతర జిల్లాల నుంచి ఎంపీడీఓలుగా ఇటీవలే జాయిన్ అయ్యారు. వీరు మినహా మిగిలిన 40 మంది బదిలీలు అవుతాయని తెలిసింది. ఈ ప్రక్రియ పీఆర్ కమిషనర్ కార్యాలయంలో ఇప్పటికే ప్రారంభమైనట్లు తెలుస్తోంది.