స్కూల్ బిల్డింగ్‌ను పేల్చివేస్తానంటూ ఓ విద్యార్థి..
బహ్రుచ్: హోమ్ వర్క్ చేయలేదని టీచర్ మందలించినందుకు ఓ విద్యార్థి ఏకంగా స్కూల్ బిల్డింగ్‌ను పేల్చివేస్తానని బెదిరించాడు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్‌కు కూడా ఇలాంటి హెచ్చరికే పంపాడు. సిబ్బందితో సహా స్టేషన్ భవనాన్ని పేల్చివేస్తానని హెచ్చరించాడు. తాను ఇస్లామిక్ స్టేట్ ఇన్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాద సంస్థ సభ్యుడినంటూ, తన పేరు జై బాగ్దాదీగా పేర్కొంటూ మెసేజ్ పంపాడు. భద్రత సిబ్బందిని ఉరుకులు పరుగులు పెట్టించాడు. విస్తుగొలిపే ఈ ఘటన శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. బహ్రుచ్లో ఇంటర్ మొదట సంవత్సరం విద్యార్థి ఈ తుంటరి చర్యకు పాల్పడ్డాడు. ఐఎస్ఐఎస్ చీఫ్ అబు బక్రల్-బాగ్దాదీ పేరును కూడా మెసేజ్‌లో ప్రస్తావించాడు.
అంబరీష్ తివారి అనే టీచర్‌కు మొదట మెసేజ్ రాగానే స్కూల్ సిబ్బంది హడలిపోయారు. వెంటనే ఆ నెంబర్‌కు ఫోన్ చేయగా సెల్ స్విచాఫ్ చేసుకున్నాడు. 10 నిమిషాల తర్వాత పాయగ్పూర్ పోలీస్ స్టేషన్ అధికారికి కూడా ఇలాంటి మెసేజ్ పంపి వెంటనే స్విచాఫ్ చేశాడు. బాంబు డిస్పోజల్ స్క్వాడ్ వెంటనే రంగంలో దిగిన జాగిలాలతో అణువణువూ శోధించారు. బాంబు లేదని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మెసేజ్ పంపిన మొబైల్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ కుర్రాణ్ని గుర్తించారు. పోలీసులు అతని ఇంటికి వెళ్లేలోగా.. అతడి తండ్రి తీసుకువచ్చి పోలీసులకు అప్పగించాడు. మెసేజ్ పంపింది తానేనని, టీచర్ మందలించినందుకు ఈ పని చేశానని ఆ కుర్రాడు చెప్పాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులోనే ఉన్నాడు.