Blue chip stocks
-
మైనస్ 208 నుంచి ప్లస్ 135కు
♦ యూరో అంచనాలతో చివర్లో లాభాలు ♦ 7,500 మార్క్‌ను దాటిన నిఫ్టీ ♦ 46 పాయింట్ల లాభంతో 7,532కు చేరిక ♦ 370 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్ ♦ 135 పాయింట్ల లాభంతో 24,794 వద్ద ముగింపు ముంబై: ట్రేడింగ్ చివర్లో బ్లూ చిప్ షేర్లలో కొనుగోళ్లు జోరుగా ఉండటంతో స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో ముగిసింది. దీంతో ఆరు రోజుల స్టాక్ మార్కెట్ లాభాల యాత్ర కొనసాగుతోంది. సెన్సెక్స్ ఐదు వారాల గరిష్ట స్థాయిని చేరగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 7,500 పాయింట్ల మార్క్‌ను దాటేసింది. సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 24,794 పాయింట్ల వద్ద, నిఫ్టీ 46 పాయింట్లు లాభపడి 7,532 పాయింట్ల వద్ద ముగిశాయి. ఆయిల్, ఇన్ఫ్రా, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, కొన్ని వాహన, బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి. ఈ ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ మొత్తం 1,792 పాయింట్లు లాభపడింది. మధ్యాహ్నం వరకూ నష్టాల్లోనే... మధ్యాహ్నం వరకూ సెన్సెక్స్ నష్టాల్లోనే ట్రేడ్ అయింది. యూరప్ కేంద్ర బ్యాంక్ ప్యాకేజీని ఇస్తుందన్న అంచనాలతో యూరప్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. దీంతో సెన్సెక్స్ అన్ని నష్టాలను పూడ్చుకొని లాభాల బాట పట్టింది. ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి సెన్సెక్స్ 200 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో 24,821, 24,451 పాయింట్ల గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. మంగళవారం నాటి ముగింపుతో చూస్తే సెన్సెక్స్ ఇంట్రాడేలో 208 పాయింట్లు నష్టపోగా, 161 పాయింట్ల లాభాన్ని పొందింది. మొత్తం మీద సెన్సెక్స్ 370 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మారుతీ జోరు.. కాంపాక్ట్ ఎస్యూవీ మోడల్ విటారా బ్రెజాను మార్కెట్లోకి తెచ్చిన నేపథ్యంలో మారుతీ సుజుకీ షేర్ 4 శాతం లాభపడి రూ.3,600 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో అత్యధికంగా లాభపడ్డ షేర్ ఇదే. 30 సెన్సెక్స్ షేర్లలో 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఎల్ అండ్ టీ, ఓఎన్జీసీ, హిందూస్తాన్ యూనిలివర్, భెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, ఇన్పోసిస్ షేర్లు 1-2 శాతం రేంజ్లో లాభపడ్డాయి. లాభాల స్వీకరణతో లోహ షేర్ల నష్టపోయాయి. వేదాంతా, హిందాల్కో, జిందాల్ స్టీల్, సెయిల్, హిందుస్తాన్ జింక్‌లు 1.5 శాతం నుంచి 4 శాతం వరకూ నష్టపోయాయి. -
సెన్సెక్స్ 150 పాయింట్లు అప్
రెండు నెలల కనిష్టం నుంచి హైజంప్ * బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు ముంబై: ఇటీవల భారీగా పతనమైన బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో దేశీ స్టాక్‌మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. కీలకమైన బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో రెండు నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని 150 పాయింట్ల లాభంతో క్లోజయ్యింది. సోమవారం ట్రేడింగ్‌లో ఒక దశలో సెన్సెక్స్ రెండు నెలల కనిష్ట స్థాయి 25,451 పాయింట్లకు పతనమైనప్పటికీ .. తర్వాత సెషన్లో అక్కణ్ణుంచి కోలుకుని 25,866 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. చివరికి 0.58 శాతం లాభంతో 25,760 వద్ద ముగిసింది. అటు ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 44 పాయింట్లు (0.57%) పెరిగి 7,807 వద్ద క్లోజయ్యింది. పారిస్‌లో ఆత్మాహుతి దాడులు, జపాన్ నుంచి నిరాశాజనక గణాంకాల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ధోరణికి అనుగుణంగా దేశీ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది. అయితే రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడులపరంగా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించడం మొదలైనవి స్టాక్ మార్కెట్ కోలుకోవడానికి కారణమై ఉంటాయని జియోజిత్ బీఎన్పీ పారిబా టెక్నికల్ రీసెర్చ్ డెస్క్ కో-హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల తోడ్పాటుతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు అర శాతం దాకా పెరిగాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీల్లో కొనుగోళ్లు.. బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు జరగ్గా.. ఐటీ, టెక్నాలజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం 1,374 స్టాక్స్ లాభాల్లోనూ, 1,259 స్క్రిప్‌లు నష్టాల్లోనూ ముగిశాయి. ఆసియా మార్కెట్లు డౌన్.. మరోవైపు పారిస్‌లో దాడులు, జపాన్ మళ్లీ మాంద్యంలోకి ప్రవేశించిందన్న గణాంకాల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమ ధోరణి కనపర్చాయి. లిస్టింగ్‌లో ఎస్‌హెచ్ కేల్కర్ పరిమళాలు.. పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థ ఎస్‌హెచ్ కేల్కర్ అండ్ కో.. లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర రూ. 180తో పోలిస్తే సంస్థ షేరు ఏకంగా 23.3 శాతం అధికంగా రూ.222 వద్ద బీఎస్ఈలో లిస్టయ్యింది. ఆ తర్వాత 23.72 శాతం దాకా పెరిగి రూ. 222.70ని తాకింది. చివరికి 15 శాతం లాభంతో రూ. 207.30 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 54.83 లక్షల షేర్లు, ఎన్ఎస్ఈలో 2.3 కోట్ల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,998 కోట్లుగా ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించింది.