పెద్ద కంపెనీల్లోనే మహిళకు చోటు!
వాషింగ్టన్: అరుంధతీ భట్టాచార్య, ఉషా అనంతసుబ్రమణియన్, చందాకొచ్చర్, శిఖా శర్మ, కల్పనా మోర్పారియా, విజయలక్ష్మీ అయ్యర్, సుభలక్ష్మీ పన్సే, అర్చనా భార్గవ... వీళ్లంతా ఎవరనుకుంటున్నారా? ఎస్బీఐ, మహిళా బ్యాంకు, ఐసీఐసీఐ సహా భారతీయ బ్యాంకుల్ని నడిపిస్తున్న మహిళలు. బ్యాంకులే కాదు. మల్లికా శ్రీనివాసన్, వినీతా బాలి, శోభనా భర్తియా, కిరణ్ షా వంటి మహిళలు ట్రాక్టర్ల నుంచి ఫార్మా రీసెర్చ్ కంపెనీలను కూడా నడిపేస్తున్నారు.
కానీ బ్యాంకులతో పోలిస్తే మహిళా అధిపతులున్న ఇతర కంపెనీల సంఖ్య తక్కువే. ఈ ట్రెండ్ ఇక్కడే కాదు. అంతర్జాతీయంగానూ ఇపుడు ఊపందుకుంటోంది. జనరల్ మోటార్స్ సంస్థ తన కొత్త సీఈఓగా మేరీ బర్రాను నియమించింది. ట్విటర్ డెరైక్టర్ల బోర్డులోకి మార్జొరీ స్కార్డినో ప్రవేశించారు. ఈ మారుతున్న పరిణామాలపై ‘బ్లూమ్‌బర్గ్’ సంస్థ ఓ అధ్యయనం చేసి తేల్చిందేంటంటే... మహిళల్ని తమ అధిపతులుగాను, డెరైక్టర్లుగాను నియమిస్తున్న కంపెనీల్లో చిన్నవాటికన్నా పెద్దవే ఎక్కువని. మొత్తమ్మీద చూసినపుడు జీతభత్యాలు, ప్రాతినిధ్యంలో మగవారితో పోలిస్తే మహిళల పాత్ర చాలా తక్కువ. కాకపోతే ఈ పరిస్థితిని మార్చడంలో పెద్ద కంపెనీలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలియజేసింది.
డెరైక్టర్ల సీట్లలో ఈ రకమైన విభజన రావడానికి కారణమేంటి? ‘‘పెద్ద కంపెనీల్లో కార్పొరేట్ పాలనపై పరిశీలన ఉంటుంది. ఇన్వెస్టర్ల ఒత్తిడితో పాటు రెప్యుటేషన్ గురించి అవి ఆలోచిస్తుంటాయి. అందుకే అవి మహిళలకు కాస్త ఎక్కువ చోటిస్తున్నాయి’’ అనేది షేర్‌హోల్డర్ ప్రాక్సీ సంస్థ గ్లాస్ లూయిస్ అధిపతి కోట్నీ అభిప్రాయం. ఈమె బోర్డుల్లో లింగ వైవిధ్యంపై పుస్తకం కూడా రాశారు. చిన్న కంపెనీలకు తక్కువ ప్రమాణాలుంటాయని, కార్పొరేట్ పాలన కూడా తక్కువని చెప్పారామె.