ఫైన్ ఆర్ట్స్
కాలుష్యం, ఉగ్రవాదం, శిశుహత్యలు... సామాజిక అంశాలను కళాఖండాల్లో ప్రతిబింబించారు మాసబ్‌ట్యాంక్ జేఎన్ఏఎఫ్ఏయూ ఫైనలియర్ విద్యార్థులు. పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా గురువారం వర్సిటీలో ఏర్పాటు చేసిన ఈ విభిన్న ప్రదర్శనలోని కళారూపాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సమాజం పట్ల విద్యార్థుల్లో ఉన్న లోతైన అవగాహనకు అద్దం పడుతున్నాయి. మొత్తం 12 మంది ఎమ్ఎఫ్ఏ విద్యార్థులు రూపొందించిన కళాఖండాలను ప్రముఖ దర్శకుడు బి.నర్సింగరావు ఆసక్తిగా తిలకించారు.
దేనికదే ప్రత్యేకం...
‘హెల్మెట్ లేకుండా బైక్ డ్రైవ్ చేసేవారిని చాలామందిని చూస్తుంటాం. నిబంధనలున్నా వాటిని ఎవరూ పాటించరు. అలాగే చె ట్లను విచక్షణార హితంగా నరికేస్తున్నారు. చెట్లు లేకపోతే మనం కూడా ఉండం. అది చెప్పడానికే చెట్లకు హెల్మెట్లు పెట్టి కళారూపం సృష్టించా’ అంటూ చెప్పుకొచ్చాడు విద్యార్థి రమేష్. కెరీర్లో కన్ఫ్యూజన్, లైఫ్ పార్ట్నర్ విషయంలో కన్ఫ్యూజన్, చివరికి చిన్న చిన్న యాక్ససరీస్ ఎంపికలోనూ కన్ఫ్యూజన్. సాఫీగా లైఫ్ సాగిపోవాలంటే కన్ఫ్యూజన్ ఉండకూడదంటూ భవ్య గీసిన ఆర్ట్ ఆకట్టుకుంది.
అలాగే హరిత్ పూరమ్... సోషల్ సైట్స్, మొబైల్ నెట్‌వర్క్‌ల వల్ల ఒకరినొకరు చూసుకోకుండానే ప్రేమలో పడిపోతున్నారు నేటి యువత. ఈ దాగుడుమూతల జాడ్యం వదిలించాలంటూ చేసిన ప్రయత్నం వినూత్నంగా ఉంది. పుట్టిన శిశువును పురిట్లోనే వదిలేస్తున్న సంఘటనలెన్నో. లెక్కకు మించి భ్రూణ హత్యలు. ఆడ శిశువును గర్భంలోనే చిదిమేస్తున్న దుష్టాంతాలు. ఈ పరిస్థితులు మారాలంటూ ఫర్జాన్‌ఖానూన్ కమలంలో పురిటి శిశువును పెట్టి చేసిన కళాకృతి ఎగ్జిబిషన్‌కే హైలైట్.
- శ్రావణ్‌జయ