వేరే బ్యాంకుల నుంచే ఆ డబ్బు వచ్చింది...
రూ. 6,100 కోట్ల ‘నల్లధనం’పై బీవోబీ వివరణ
న్యూఢిల్లీ: బ్లాక్‌మనీగా ఆరోపణలు వస్తున్న రూ. 6,100 కోట్ల రెమిటెన్సు అంశానికి సంబంధించి బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) వివరణనిచ్చింది. ఇందులో దాదాపు 90% నిధులు తమకు సక్రమమైన మార్గంలో 30 పైచిలుకు బ్యాంకుల నుంచి ఆర్టీజీఎస్ లేదా నెఫ్ట్ రూపంలో వచ్చాయని పేర్కొంది. మిగతా 10% నగదు లావాదేవీ మాత్రమే తమ శాఖలో చోటు చేసుకుందని బీవోబీ ఎగ్జిక్యూటివ్ డెరైక్టరు బీబీ జోషి తెలిపారు.
ఇది నల్లధనమా కాదా అనేది విచారణ నిగ్గు తేలుస్తుందని ఆయన వివరించారు. రెమిటెన్సును రూ. 6,100 కోట్లుగా అతి చేసి చెబుతున్నారని, వాస్తవానికి అసలు మొత్తం చాలా తక్కువే ఉండొచ్చని జోషి చెప్పారు. ఈ అంశంలో బ్యాంకుకు ఆర్థికంగా నష్టం ఏమీ లేనప్పటికీ, ప్రతిష్టకు మాత్రం భంగం క లిగిందని ఆయన వ్యాఖ్యానించారు. పప్పు ధాన్యాలు, జీడిపప్పు మొదలైన వాటి దిగుమతి ముసుగులో రూ. 6,172 కోట్ల నల్ల ధనం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి హాంకాంగ్‌కు మళ్లించినట్లు ఆరోపణలు రావడం..
దీనిపై సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ విచారణ ప్రారంభించడం తెలిసిందే. న్యూఢిల్లీలోని అశోక్ విహార్ శాఖలో గల 59 కరెంటు అకౌంటు ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. దిగుమతులకు చెల్లింపుల కోసం 38 ఖాతాల నుంచి సుమారు రూ. 3,500 కోట్ల మేర రెమిటెన్సులు జరిగినట్లు బ్యాంకు నియంత్రణ సంస్థలకు తెలిపింది. హాంకాంగ్, యూఏఈకి చెందిన సుమారు 400 పార్టీల ఖాతాల్లోకి ఈ మొత్తం వెళ్లినట్లు వివరించింది.
విదేశీ మారక నిర్వహణ చట్ట నిబంధనలను సదరు శాఖ సరిగ్గా పాటించలేదని బీవోబీ అంగీకరించింది. అయితే, అంతర్గత విచారణలో బ్యాంకే దీన్ని గుర్తించి సీబీఐ, ఈడీకి సమాచారం ఇచ్చినట్లు, ఇద్దరు ఉద్యోగులను కూడా సస్పెండ్ చేసినట్లు పేర్కొంది.