లాభాల్లోకి బ్యాంక్ ఆఫ్ ఇండియా
జూన్ క్వార్టర్లో రూ.88 కోట్లు
ముంబై: జూన్ క్వార్టర్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరిగి లాభాల్లోకి అడుగు పెట్టింది. రూ.88 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. ఆస్తుల నాణ్యత మెరుగుపడడంతో మొండి బాకాయిలకు చేసిన కేటాయింపులు తగ్గాయి. గతేడాది ఇదే కాలంలో బ్యాంకు రూ.741 కోట్ల నష్టాన్ని ఎదుర్కోవడం గమనార్హం. మొండి బకాయిలను మరింత మెరుగ్గా వసూలు చేయడంతోపాటు, ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారకుండా తీసుకున్న చర్యలు ఫలించినట్టు బీవోఐ ఎండీ, సీఈవో దీనబంధు మొహపాత్ర తెలిపారు. గతేడాది ఇదే త్రైమాసిక కాలంలో మొండి బకాయిల వసూళ్లు రూ.970 కోట్లు ఉంటే, తాజాగా రూ.1,360 కోట్లకు పెరిగాయి. స్థూల ఎన్పీఏలు 13.38 శాతం నుంచి 13.05 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏలు సైతం 7.78 శాతం నుంచి 6.7 శాతానికి దిగొచ్చాయి.