ఉపాధి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం
ఆలూరు రూరల్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద రైతుల పొలాల గట్లపై మొక్కలను పెంచేందుకు ప్రభుత్వం కేటాయించిన నిధులు ఖర్చు అయినా ఎలాంటి ప్రయోజనం కనబడడం లేదంటూ జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ గురువారం ఆలూరు ఉపాధి హామీ ఏపీడీ వీరన్న, ఏపీఓ బొజ్జప్పపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలూరు మండలం పెద్దహోతూరు గ్రామంలో ఇంకుడు గుంతలను పరిశీలించేందుకు కలెక్టర్ వెళ్లారు.
అక్కడ కొంతమంది రైతులు పొలాల గట్లపై వేసిన టేకు, తదితర మొక్కలను ఆయన పరిశీలించారు. కొంతమంది రైతులు ఉపాధి హామీ సిబ్బంది రైతులకు మొక్కలను పంపిణీ చేసినట్లు రికార్డుల్లో రాసుకుంటున్నారే తప్పా తమకు మొక్కలు ఇవ్వడం లేదన్నారు. అలాగే గతంలో ఇంకుడు గుంతలను కూలీలు తవ్వినా వారికి కూడా కూలీ డబ్బులు పంపిణీ చేయలేదన్నారు. గ్రామంలో దాదాపు ఉపాధి కూలీలకు గతేడాదిగా రూ.1.35 లక్షలకు పైగా డబ్బులను సంబంధిత అధికారులు పంపిణీ చేయలేదని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
దీనిపై స్పందించిన కలెక్టర్ ఏపీడీ, ఏపీఓ, ఫీల్డ్ అసిస్టెంట్లపై మండిపడ్డారు. గతంలో ప్రభుత్వం టేకు, ఎర్రచందనం తదితర మొక్కలను ఆలూరు జీవనోపాదుల వనరుల కేంద్రంలో పెంచిన చెట్లను ఏయే రైతులకు పంపిణీ చేశారో తనకు వివరాలు తెలపాలని ఆదేశించారు. పొలం గట్లపై రైతులు చెట్లను పెంచడం వల్ల అనేక లాభాలు ఉంటాయన్నారు. కనీసం రైతులకు చెట్ల వల్ల ప్రయోజనాలను కూడా వివరించకపోవడం సిగ్గుచేటన్నారు. మూడు నెలల తరా్వాత తిరిగి పెద్దహోతూరు గ్రామంలో పర్యటిస్తానన్నారు.
ప్రతి రైతు పొలం గట్లపై మొక్కలు ఉండేలా చూడాలని తెలిపారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. మండలంలో జరిగే ప్రతి ప్రజా, రైతు అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తానన్నారు. ప్రజలు, రైతులను నిర్లక్ష్యంచేసే సిబ్బందిపై చర్యలు తప్పవని కలెక్టర్ పేర్కొన్నారు.