తప్పించుకునేందుకే..!
బొమ్మల బాగోతం ఇప్పుడు సంబంధిత శాఖ అధికారులను కుదిపేస్తోంది. ఒకవైపు ఈ వ్యవహారం నిగ్గుతేల్చేందుకు ఉన్నతాధికారులు యత్నిస్తుండగా, మరోవైపు తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఐకేపీ అధికారులు యత్నాలు ముమ్మరం చేశారు. ఇంతవరకూ స్పందించని బొమ్మల ఏజెన్సీ ఇప్పుడు ఐటీడీఏ పీఓకు లే ఖ రాసింది. అధికారులే సంబంధిత కంపెనీతో లేఖ రాయించారని ఆరోపణలు వస్తున్నాయి. పూర్తిస్థాయిలో విచారణ జరిపితేనే లక్షలాది రూపాయల అవకతవకల వెనుక ఉన్నది ఎవరన్నది తేలుతుందని గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పార్వతీపురం : పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని ఐకేపీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆరోగ్య పౌష్టికాహార కేంద్రాల్లో పిల్లలకు అందజేసేందుకు బొమ్మల కొనుగోలులో జరిగిన అవకతవకలను ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చాక...దీంట్లో ప్రమేయమున్న అధికారులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. పాత అధికారులను కాపాడే పనిలో కొత్త అధికారులున్నట్టు తెలిసింది. డొంక కదిలిన తరువాత మిగతా బొమ్మలను వెంటనే సరఫరా చేస్తామని పశ్చిమ గోదావరి భీమవరానికి చెందిన రామకృష్ణ ఏజెన్సీ ఐటీడీఏ పీఓకు ఓ లేఖ రాసింది. అయితే ఐకేపీ అధికారులే వెనుక ఉండి ఆ ఏజె న్సీ యాజమాన్యంతో ఈ లేఖ రాయించినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
213 కేంద్రాలకు గాను అప్పట్లో 17 కేంద్రాలకే బొమ్మలు సరఫరా చేశామని, మిగతా కేంద్రాలకు ఇప్పుడు బొమ్మలు సరఫరా చేస్తామని పేర్కొంటూ ఏజెన్సీ తనకు లేఖ పంపినట్లు ఐటీ డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీకేశ్ బుధవారం ప్రకటించారు. మిగతా బొమ్మలను సరఫరా చేసేందుకు ఆ ఏజెన్సీకి ఈ నెలాఖరు వరకు సమయమిచ్చినట్టు తెలిపారు. లేకపోతే ఆ కంపెనీతో పాటు సంబంధిత అధికారుల నుంచి సొమ్ము రికవరీ చేసి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది ?
అప్పట్లో పూర్తిస్థాయిలో బొమ్మలు ఇవ్వకుండానే సంబంధిత అధికారులు పూర్తి మొత్తాన్ని ఆ కంపెనీకి ఎలా చెల్లించారు ? చెల్లించిన మొత్తంలో ఎంతవరకు అవకతవకలు జరిగాయి ? ఇన్నాళ్లు ఆ కంపెనీ పూర్తిస్థాయిలో బొమ్మలు సరఫరా చేయకపోతే సంబంధిత అధికారులు ఎందుకు మిన్నకున్నారు ? అప్పట్లో సరఫరా అయిన బొమ్మలను ఆయా కేంద్రాలకు ఎందుకు పంపిణీ చేయలేదు ? బొమ్మలు వచ్చాక, వాటి నాణ్యతను పరిశీలించాక ఏజెన్సీకి సొమ్ము చెల్లించాల్సి ఉండగా, ముందుగానే ఎందుకు చెల్లించినట్టు ? అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పే వారే కరవయ్యారు. బొమ్మల కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నా దీనికి బాధ్యులైన వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవ డం లేదని గిరిజనులు, గిరిజన సంఘాలు ప్రశ్నస్తున్నాయి.
రికవరీ అయ్యాక చర్యలు : ఐటీడీఏ పీఓ
పథకానికి అందజేస్తున్న ఆర్థిక సాయాన్ని మాత్రమే నిలిపివేశారని, పథకం కొనసాగుతుందని ఐటీడీఏ పీఓ తెలిపారు. సంబంధిత కంపెనీ నుంచి బొమ్మలను రికవరీ చేసుకున్న తరువాత వాటిని ఏం చేయాలన్నదానిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.