చిట్టి మొక్కలు.. చెట్టన్నలు
తెనాలి: రాఖీ పర్వదినం సందర్భంగా నాజరుపేటలోని లూథరన్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ జాలా రాజకుమారి ‘చిట్టి మొక్కలు– చెట్టన్నల’ పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో ప్రకృతి కవలలుగా వున్న అశోకచెట్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి పవిత్రమైన రాఖీని కట్టారు. పాఠశాల ప్రారంభంలో 40 ఏళ్ల నాడు నాటిన రెండు మొక్కలు నేటి వరకు పెరుగుతూ ప్రకృతి మానవుల నుంచి ఎదురయే ఆటుపోట్లకు తలొగ్గక తమ నీడలో చల్లదనాన్నిస్తూ, చూపరులకు సతత హరితాన్నిస్తూ, ప్రేమతో ప్రాణవాయువు పంచుతున్నందుకు కృతజ్ఞతగా రాఖీని సమర్పించినట్టు రాజకుమారి చెప్పారు. ముఖ్యఅతిథిగా హాజరైన షారోన్ టాలెంట్ స్కూలు డైరెక్టర్ బెనర్జీ ఈ పాఠశాలకు వంద మొక్కలను బహూకరించారు. ప్రిన్సిపల్ మేరీ బెనర్జీ పర్యావరణంపై మాట్లాడారు. జ్యోతిశ్రీ విద్యార్థులతో ప్రకృతి ప్రతిజ్ఞ చేయించారు. ప్రియదర్శిని, శ్రీకాంత్, గీత, వాణి పాల్గొన్నారు.