వృద్ధుని ఆత్మహత్యాయత్నం
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధుడు బలవన్మరణానికి యత్నించాడు. విజయనగరం జిల్లా జామి మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్.కోట మండలం గోపాలపల్లికి చెందిన బోని ఆంజనేయులు(75)కు నా అన్నవారెవరూ లేరు. అనారోగ్యంతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన ఆ వృద్ధుడు జామిలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో బ్లేడుతో గొంతుకోసుకున్నాడు. రక్తపు మడుగులో పడి ఉండగా గమనించిన చుట్టుపక్కల వారు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారటంతో అక్కడి నుంచి విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఎస్సై ఎస్.ఘని ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.