నకిలీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల ఆటకట్టు
మరిపెడ, న్యూస్‌లైన్ : ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన నకిలీ పోలీసులను మరిపెడ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ డీఎస్పీ రమాదేవి నిందితుల వివరాలు వెల్లడించారు. మరిపెడకు చెందిన మచ్చర్ల లింగయ్య, మచ్చర్ల లక్ష్మణ్, మమబూబాబాద్ మండలం లక్ష్మీపురానికి చెందిన బానోతు మురళి, నల్లగొండ జిల్లా రామన్నపేటకు చెందిన జి. కుమార్‌తో అదే జిల్లా ఆత్మకూరు మండలం దుంపెల్లి గ్రామానికి చెందిన మారోజు రత్నాచారి ముఠాను ఏర్పాటు చేశాడు. వీరిలో లింగయ్య లాండ్రీషాపు నడుపుతుండగా మిగతావారు ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు.
ఇదిలా ఉండగా కురవి మండలం మాదాపురానికి చెందిన భూక్య శ్రీను కొంతకాలంగా హైదరాబాద్‌లో కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమం లో అతడు నాలుగు రోజుల క్రితం గంజారుు విక్రరుుస్తూ పోలీసులకు చిక్కాడు. దీంతో అతడిపై హైదరాబాద్‌లో గంజాయి కేసు నమోదైంది. టాస్క్‌ఫోర్స్ పోలీసులతో ఉన్న పరిచయంతో వారి ద్వారా విష యం తెలుసుకున్న రత్నాచారి నిందితుడి కుటుంబం నుంచి డబ్బులు రాబట్టేందుకు పథక రచన చేశాడు. లింగయ్య, లక్ష్మణ్, మురళి, కుమార్‌తో కలిసి హైదరాబాద్‌లోనే కారు అద్దెకు తీసుకుని గురువారం రాత్రి మాదాపురం చేరుకున్నాడు.
తాము టాస్క్ ఫోర్స పోలీసులమని నీ భర్తను కేసు నుంచి విడిపిస్తామని శ్రీను భార్యతో నమ్మబలికి ఆమె వద్ద బంగారు చెవిదిద్దులు, కాళ్ల వెండిపట్టీలు తీసుకున్నారు. అదే తండాకు చెందిన ఆంగోతు రాములుతో కూడా నీపై గతంలో ఉన్న కేసులను ఎత్తివేయిస్తామని చెప్పడంతో ఆయన నమ్మలేదు. అయినా బలవంతంగా కారులో ఎక్కించుకుని నల్లగొండ జిల్లా భువనగిరికి తీసుకెళ్లారు. ఎంత బెదిరించినా అతడు తనవద్ద ఒక్కపైసా కూడా లేదని చెప్పడంతో చేయిచేసుకున్నారు. చివరికి రూ.80 వేలు ఇస్తానని తేల్చిచెప్పడంతో అతడిని కొట్టడం ఆపేశారు.
అనంతరం భువనగిరి నుంచి సూర్యాపేటకు తీసుకొచ్చారు. రాములు తన అల్లుడైన మరిపెడ మండలం ఉల్లెపల్లి శివారు భూక్యతండాకు చెందిన రామ్మూర్తికి అక్కడి నుంచి ఫోన్ చేసి నకిలీ టాస్క్‌ఫోర్స్ పోలీసులకు ఇచ్చాడు. తన మామ రాములును వదిలిపెట్టడానికి ముందు రూ.50 వేలు ఇస్తానని రామ్మూర్తి అంగీకరించాడు. డబ్బులు తీసుకునేందుకు మండలంలోని ఎల్లంపేట స్టేజీ వద్దకు రావాలని చెప్పి, వెంటనే స్థానిక పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. శుక్రవారం మధ్యాహ్నం కారు లో నకిలీలు స్టేజీ వద్దకు చేరుకున్నారు.
అప్పటికే మాటువేసి ఉన్న కానిస్టేబుళ్లు రమేష్, రాజు వారిని అనుమానించి లింగయ్య, చారిని పట్టుకోగా మిగతావారు పరారయ్యారు. దొరికిన విచారించి హైదరాబాద్‌లో ఉన్న మురళి, లక్ష్మణ్‌ను కూడా అరెస్టు చేశారు. కుమార్ పరారీలో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. నిందితుల అరెస్ట్‌లో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను ఆమె అభినందించారు. కురవి సీఐ రవీందర్, మరిపెడ ఎస్సై వెంకయ్య, నర్సింహుల పేట ఎస్సై వై. వెంకటప్రసాద్, కానిస్టేబుళ్లు రమేష్,రాజు, కరుణాకర్, వీరరాఘవులు పాల్గొన్నారు.