అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం
బోకా చినా(అమెరికా): అగ్రరాజ్యం అమెరికాలో అంతరిక్ష ప్రయోగాల్లో మరో ఇంజనీరింగ్ అద్భుతం చోటుచేసుకుంది. రాకెట్‌ను నింగిలోకి పంపించాక బూస్టర్‌ను మళ్లీ వినియోగించుకునేందుకు సాయపడే కొత్తరకం సాంకేతికతను అంతరిక్షరంగ సంస్థ స్పేస్ఎక్స్ విజయవంతంగా పరీక్షించింది. ప్రయోగవేదిక నుంచి రాకెట్తోపాటు నింగిలోకి దూసుకెళ్లిన బూస్టర్ తిరిగి యథాస్థానానికి ఎగిరొచ్చిన ఘటనకు దక్షిణ టెక్సాస్‌లోని స్టార్‌బేస్ ప్రయోగవేదిక సాక్షిగా నిలిచింది. అమెరికా స్థానికకాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఈ స్టార్‌షిప్ రాకెట్‌ను ప్రయోగించారు. రాకెట్‌లోని 232 అడుగుల(71 మీటర్ల) ఎత్తయిన బూస్టర్.. లాంఛ్‌ప్యాడ్ నుంచి స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి పంపించిన ఏడు నిమిషాల తర్వాత మళ్లీ లాంఛ్ప్యాడ్కు వచ్చి చేరింది. నిప్పులు కక్కుతూ తిరిగొచి్చన బూస్టర్‌ను లాంఛ్ప్యాడ్లోని మెకానికల్ ‘చాప్‌స్టిక్’ చేతులు ఒడిసిపట్టిన వీడియోను స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్‌మస్క్ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్‌చేశారు. ‘‘రాకెట్‌ను లాంచ్‌టవర్ ఒడుపుగా పట్టేసుకుంది. ఇదొక సైన్స్ ఫిక్షన్. అయితే ఇందులో ఎలాంటి ఫిక్షన్ లేదు’’ అని మస్క్ టీŠవ్ట్చేశారు. ప్రయోగం విజయవంతమవడంతో ప్రయోగకేంద్రంలోని స్పేస్ఎక్స్ శాస్తవేత్తలు, సంస్థ ఉద్యోగులు ఆనందంతో కేరింతలు కొట్టారు. నాసా అడ్మినిస్టేటర్ సైతం వీళ్లకు ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా 400 అడుగుల(111 మీటర్ల)ఎత్తయిన అత్యంత భారీ రాకెట్‌కు సంబంధించిన బూస్టర్ ఇలా లాంఛ్‌ప్యాడ్ మీదకే తిరిగిచేరడం ఇదే తొలిసారి. బూస్టర్ వల్ల నింగిలోకి వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్‌ను శాస్త్రవేత్తలు హిందూమహాసముద్రంలో నిర్దేశిత సముద్రప్రాంతంలో దించారు. ఇంజనీరింగ్ చరిత్ర పుస్తకాల్లో లిఖించదగ్గ రోజు ఇది అని స్పేస్ఎక్స్ ప్రధానకార్యాలయంలో ఇంజనీరింగ్ మేనేజర్ కేట్ టైస్ ఆనందం వ్యక్తంచేశారు.లాంచ్ప్యాడ్పై తొలిసారిగా.. చిన్నపాటి ‘ఫాల్కన్–9’ రాకెట్లకు వినియోగించిన ఫస్ట్–స్టేజీ బూస్టర్లను గత తొమ్మిదేళ్లుగా స్పేస్ఎక్స్ వినియోగిస్తోంది. అయితే అందులో ఏవీ కూడా మళ్లీ లాంచ్‌ప్యాడ్‌కు చేరుకోలేదు. క్యాప్సూల్, స్పేస్‌క్రాఫ్ట్‌ను నింగిలోకి తీసుకెళ్లాక ఫస్ట్–స్టేజీ బూస్టర్లు సముద్రంలోని నిర్దేశిత తేలియాటే తలాలపై క్షేమంగా ల్యాండ్ అయ్యేవి. లేదంటే లాంచ్‌ప్యాడ్‌కు ఏడు మైళ్ల దూరంలోని కాంక్రీట్ శ్లాబులపై ల్యాండ్ అయ్యేవి. కానీ ఇలా భారీ ఫస్ట్–స్టేజీ బూస్టర్ తిరిగి లాంచ్‌ప్యాడ్‌కు తిరిగిరావడం ఇదే తొలిసారి. జూన్‌లో మినహా గతంలో భారీ ఫస్ట్–స్టేజీ బూస్టర్ల పునరాగమనంపై ప్రయోగాలు విఫలమయ్యాయి. ఫాల్కన్ విషయంలో సక్సెస్ అయిన ఫార్ములాను భారీ స్టార్‌షిప్‌కు వాడాలని మస్క్ నిర్దేశించుకుని ఎట్టకేలకు విజయం సాధించారు. ఒక్కోటి 33 మిథేన్ ఇంధన ఇంజన్ల సామర్థ్యముండే బూస్టర్లతో తయారైన స్టార్‌షిప్ ప్రపంచంలోనే అతి ఎత్తయిన పెద్ద రాకెట్‌గా పేరొందింది. ఇలాంటి రెండు స్టార్‌షిప్‌లను సరఫరాచేయాలని స్పేస్ఎక్స్కు నాసా ఆర్డర్ ఇచి్చంది. ఈ దశాబ్ది చివరికల్లా చంద్రుడి మీదకు వ్యోమగాములను తరలించేందుకు వీటిని వాడనున్నారు.