కాలిఫోర్నియాలో భూకంపం
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో శుక్రవారం భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపన తీవ్రత 5.2గా నమోదైంది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.05 ప్రాంతంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అమెరికా జియోలాజికల్ సర్వీసెస్ వెల్లడించింది. తూర్పు లాస్ ఏంజెలెస్ ఏడారిలోని వాయువ్య బొరెగొ స్ప్రింగ్స్ కు 13 మైళ్ల దూరంలో భూకంపన కేంద్రాన్ని గుర్తించింది.
భూకంపన తీవ్రతను మొదట 5.1 గా ప్రకటించి గంట తర్వాత 5.2 గా సవరించింది. 30 సెకన్ల పాటు భూమి కంపించినట్టు వెల్లడించింది. లాస్ ఏంజెలెస్ పశ్చిమ ప్రాంతం, శాన్ డియాగోలో ప్రకంపనల తీవ్రత కనిపించిందని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఎటువంటి నష్టం జరిగినట్టు సమాచారం లేదు. 1937లో 6 తీవ్రతతో భూకంపం వచ్చిందని భూగర్భ శాస్త్రవేత్త లూసీ జోన్స్ వెల్లడించారు. 1980లో 5.3 తీవ్రతతో భూమి కంపించిన విషయాన్ని ఆమె గుర్తు చేశారు.