బీజేపీ బలపరీక్షపై కోర్టుకు కాంగ్రెస్
ముంబై: నిబంధనలకు భిన్నంగా శాసనసభలో ఫడ్నవిస్ ప్రభుత్వం బలపరీక్షను మూజువాణి ఓటుతో గెలిచిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించనుంది. ఇందుకోసం రాజ్యాంగ నిపుణుల సలహాలను తీసుకుంటోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధికార ప్రతినిధి అనంత్గాడ్గిల్ బుధవారం మీడియాకు వెల్లడించారు.విశ్వాస పరీక్ష సమయంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ నిబంధనలను ఏవిధంగా ఉల్లంఘించిందనే విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు గాడ్గిల్ తెలిపారు.
మరోవైపు బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు... పిటిషనర్ విన్నపాన్ని మన్నించేందుకు నిరాకరించింది. తన పిల్‌పై తుది నిర్ణయం వెలువడేదాకా ఫడ్నవిస్ నేతృత్వంలోని ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలంటూ పిటిషనర్ సంజయ్ లాఖే పాటిల్ విన్నవించాడు. అయితే అందుకు హైకోర్టు నిరాకరించింది.