అహోబిలేశుడి బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
అహోబిలం(ఆళ్లగడ్డ): అహోబిల లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్, మఠం ప్రతినిధి సంపత్, దేవస్థాన కార్యనిర్వహణ అధికారి మల్లికార్జున ప్రసాదు, వేదపండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నియమనిష్టలతో.. విశేష పూజలతో బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని యాగశాలలో ఉదయం నుంచి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు విశ్వక్సేనుడికి పూల మాలలు వేసి తల పాగా చుట్టి పల్లకిలో కొలువుంచారు.
పల్లకిని ఆలయం వెలుపలకు తీసుకొచ్చి ఉత్సవం నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఎటువంటి ఆటంకాలు కలుగకుండా నిరంతరం పర్యవేక్షకుడిగా విశ్వక్సేనుడు వ్యవహరిస్తారని విశ్వాసం. అనంతరం మంగళ వాయిద్యాలతో వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆలయానికి ఈశాన్యం వైపున ఉన్న పుట్ట మన్ను తీసుకు వచ్చారు. పుట్టమన్ను, కుంకుమ, పసుపుతో బ్రహ్మోత్సవ మండపాన్ని సుందరంగా అలకంరించి అంకుర హోమం నిర్వహించారు. సోముడిని (చంద్రుడిని) మట్టిలోకి ఆవాహం చేశారు. పాత్రలో ఉన్న మట్టిలో నవగ్రహాలకు సూచికగా నవధాన్యాలు పోసి సోమ కుంభస్థాపన చేశారు.
నేడు ధ్వజారోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుంది. అనంతరం భేరీపూజ కొనసాగుతుంది. సింహ వాహనంపై స్వామి, అమ్మవారులు భక్తులకు దర్శనమివ్వనున్నారు. దిగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాల నిర్వహణ సందర్భంగా శుక్రవారం సాయంత్రం వేదపండితుల ఆధ్వర్యంలో అంకురార్పరణ కార్యక్రమం నిర్వహిస్తారు.