ఇత్తడైనా.. ‘బుడితి’ చేతిలో పుత్తడే !
‘బుడితి’ వస్తువు లేకపోతే శుభ కార్యాల్లో వెలితి అని ఉత్తరాంధ్ర వాసుల నోట నానేటి మాట. అక్కడి నుంచి ఇత్తడి సారె, సామాను తీసుకురాకుంటే ఏ పెళ్లికైనా నిండుదనం రాదంతే. ఆ ఊరి విగ్రహాలు లేకుంటే ఎంత పెద్ద ఆలయానికైనా శోభ రాదంటే అతిశయోక్తి కాదు. శ్రీకాకుళం జిల్లా సారవకోటలోని బుడితి గ్రామం కంచు, ఇత్తడి వస్తువులకు శతాబ్దానికి పైగా కేరాఫ్.
సారవకోట: దాదాపు నూటయాభై ఏళ్ల కిందట శ్రీకాకుళం జిల్లాలోని బుడితి పుత్తడి బొమ్మలకు పెట్టింది పేరు. స్వచ్ఛమైన బంగారంతో ఇక్కడి కళాకారులు చేసే ఏ వస్తువైనా ప్రత్యేకంగా కనిపిస్తుండేది. కాలక్రమేణా వీరి వృత్తి పుత్తడి నుంచి ఇత్తడికి చేరింది. ముడి సరుకు మారినా వారి పనితీరు మాత్రం మారలేదు. అప్పట్లో చేతితోనే ఏ వస్తువైనా తయారు చేసేవారు. ఇలా ఇక్కడి విశ్వ బ్రాహ్మణులు ఓ బ్రాండ్‌గా మారి ఇత్తడి వస్తువుల పరిశ్రమను అభివృద్ధి చేశారు. తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ఇక్కడ సుత్తుల సవ్వడులు, బిందెల మోతలు వినిపిస్తూనే ఉంటాయి. అయితే వీరి వృత్తిలోనూ యంత్రాల వినియోగం ఊపందుకోవడంతో.. ఆ మేరకు కార్మికుల సంఖ్య కూడా తగ్గుతూ వస్తుండం గమనార్హం.
నమ్మకమే పెట్టుబడి..
ఇక్కడి కార్మికుల పనితీరుపై ఉన్న నమ్మకమే ఇత్తడి పరిశ్రమ అభివృద్ధి చెందడానికి దోహదపడింది. పవిత్రమైన దేవాలయాల నుంచి సామాన్య మధ్య తరగతి ప్రజలతో పాటు సినీ పరిశ్రమకు అవసరమైన వస్తువులూ ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ తయారైన దేవతా విగ్రహాలు దేశంలోని పలు దేవాలయాల్లో కొలువై ఉన్నాయి. బిందెలు, గృహోపకరణాలు, దేవతా విగ్రహాలు, దేవాలయాల్లో ఉపయోగించే మకర తోరణాలు, గంటలు వీరి ప్రత్యేకత. ఇక్కడి వస్తువులపై నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఆర్డర్లు వస్తుంటాయి.
ప్రతి ఇంటా అనుబంధం
ఇత్తడితో ప్రతి ఇంటికీ విడదీయరాని అనుబంధం ఉంటుంది. పెళ్లి నుంచి చావు వరకు ఈ వస్తువులు లేని కార్యక్రమం లేదు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏ ఇంటిలోనైనా పెళ్లి కుదిరిందంటే ముందుగా బంగారం కన్నా ఇత్తడి వస్తువులనే కొనుగోలు చేస్తారు. అయితే ప్రస్తుతం యంత్రాలతో తయారవుతున్న వస్తువులు మార్కెట్లో విరివిగా చలామణి అవుతుండడంతో వీరి ఆదాయానికి భారీగా గండి పడుతోంది.
లేపాక్షి ఆర్డర్లు..
ఇక్కడ తయారైన వస్తువులు లేపాక్షి వారు కొనుగోలు చేసి వాటిని పలు ప్రాంతాలు, రాష్ట్రాల్లో జరుగుతున్న వస్తు ప్రదర్శనలకు తీసుకెళ్తుంటారు. ఇతర రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల్లో జరిగిన ఈ వస్తు ప్రదర్శనల్లో బుడితి కంచు, ఇత్తడి వస్తువులకు భలే గిరాకీ ఉంటుందని తయారీ దారులు తెలిపారు.అయితే లేపాక్షి వారు వస్తువులు ఆర్డర్ చేసే సమయంలో అడ్వాన్స్‌గా తక్కువ మొత్తం చెల్లిస్తుండడంతో.. వస్తువులు తయారు చేయడానికి తగిన పెట్టుబడి లేక కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇతర పనులకు వెళ్లిపోతున్నారు
గ్రామంలో సుమారు వందేళ్ల నుంచి మా కుటుంబం ఈ పనిచేస్తోంది. ఇప్పుడు మార్కెట్లో ఇత్తడి వస్తువులకు డిమాండ్ అనుకున్నంత లేకపోవడంతో కొందరు ఈ పనిని వదిలి ఇతర పనులకు వెళ్లిపోతున్నారు. గతంలో వందలాది కుటుంబాలు ఈ వృత్తిపై ఆధారపడి జీవించేవి.
– పాటోజు శ్రీనివాసాచార్యులు, చీడిపూడి, సారవకోట మండలం
ఈ పనిపైనే జీవిస్తున్నాం
మా తాత, ముత్తాతల నుంచి ఈ పనిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. నేను చిన్నతనం నుంచి పనిచేస్తున్నాను. ఇదే పనిని వృత్తిగా చేసుకుందామని ప్రస్తుత యువతరం ముందుకు రావడం లేదు. దీంతో మా తదనంతరం ఈ పని చేసేవారు ఉంటారనే నమ్మకం లేకుండా పోతుంది.
– కింతాడ కృష్ణారావు, విగ్రహ తయారీ దారు, చీడిపూడి, సారవకోట