ఆ నిర్భయ కేసులో ఇద్దరి అరెస్టు
బ్రెజిల్లో 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం చేసి, ఆ వీడియోను ట్విట్టర్లో పెట్టిన కేసులో ఇద్దరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. మరో నలుగురు నిందితుల కోసం గాలిస్తున్నారు. నిర్భయ ఉద్యమ స్ఫూర్తితో బ్రెజిల్ వాసులు కూడా ఈ ఉదంతంపై పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడంతో పోలీసులు స్పందించి ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో రాయ్ సౌజా (22) అనే నిందితుడు తానే పోలీసులు ముందు లొంగిపోయాడు. మరోవ్యక్తి లూకాస్ పెర్డోమో స్థానిక ఫుట్బాల్ క్రీడాకారుడు. మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ ఏర్పాటుచేస్తున్నట్లు బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైఖేల్ టెమర్ ప్రకటించారు. ఇటీవలి కాలంలో పలు వర్గాలపై, ముఖ్యంగా మహిళలపై నేరాలు పెరిగిపోతున్నాయని, దీన్ని అరికట్టేందుకు అందరం కలిసి పనిచేయాలని ఆయన అన్నారు.
మే 21వ తేదీన ట్విట్టర్లో 38 సెకండ్ల వీడియో ఒకటి ప్రత్యక్షమైంది. అందులో బాధితురాలు నగ్నంగా పడి ఉంది. వెనకనుంచి పురుషుల గొంతులు గట్టిగా కనీసం 30 మంది ఆమెపై అత్యాచారం చేసినట్లు చెబుతుంటాయి. 16 ఏళ్ల అమ్మాయిపై సామూహిక అత్యాచారం జరిగిందని, అయితే ఎంతమంది అన్న విషయం మాత్రం నిర్ధారణ కావాల్సి ఉందని పోలీసులు తెలిపారు.