బాలికపై 33 మంది గ్యాంగ్‌రేప్
బ్రెజిల్లో ఘోరం
రియో డి జనెరియో: ఇది సభ్యసమాజం తలదించుకునే ఘటన. 33 మంది మానవ మృగాలు 16 ఏళ్ల బాలికను చెరపట్టిన ఘోరమిది. బ్రెజిల్లో జరిగిన ఈ దారుణకాండ ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికపై 30 మందికిపైగా కామాంధులు సామూహిక అత్యాచారం జరిపిన ఘటన ఆ దేశాన్ని తీవ్రంగా వణికించింది. ఈ వీడియోను సామాజిక మాధ్యమంలో చూసి బ్రెజిల్ ప్రజలు నిర్ఘాంతపోయారు. సో జువో నగరంలో ఈనెల 21న ఈ అత్యాచార ఘటన జరిగినట్లు భావిస్తున్నారు.
బాలిక సో జువోలో తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగిందని అంటున్నారు. ఇది తనను చాలా కలచివేసిందని ఆ బాలిక ఓ పత్రికతో కన్నీళ్లపర్యంతమైంది. తాను కురచ దుస్తులు ధరించానని, అందువల్లనే ఇలాంటి ఘోరం జరిగిందని అనడం సరికాదని చెప్పింది. బాధితురాలినే నిందించడం భావ్యంకాదని తీవ్ర ఆవేదన వ్యక్తంచేసింది. ఘటనను బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మైకేల్ టెమెర్ తీవ్రంగా ఖండించారు.వీరిలో ఇప్పటిదాకా నలుగురిని గుర్తించామని, వీరిని పట్టుకునేందుకు విస్తృత గాలింపు చర్యలు చేపట్టామని రియో పోలీస్ చీఫ్ ఫెర్నాడో వెలోసో చెప్పారు.