ఆర్నెల్లుగా కారుణ్య నియామకాలకు బ్రేక్
సాక్షి,సిటీబ్యూరో: బాధిత కుటుంబాలను ఆదుకోవాల్సిన హైదరాబాద్ జిల్లా యంత్రాంగానికి కనికరం లేకుండాపోయింది. నిబంధనల ప్రకారం..ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే, ఉద్యోగి కుటుంబ సభ్యుల్లో అర్హత కలిగిన వ్యక్తికి ఉద్యోగం ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబసభ్యులు తమకు ఉద్యోగం ఇవ్వండంటూ.. ప్రతిరోజూ కలెక్టరేట్ చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు.
గత ఆ ర్నెల్లలో కలెక్టరేట్‌కు చేరిన పాతిక దరఖాస్తులు పరిష్కారానికి నోచుకోకపోవడం విచాకరం.
బోడిగుండుకు మోకాలికి..: తండ్రిని కోల్పోయిన కొడుకు, భర్తను కోల్పోయిన భార్య, అమ్మను కోల్పోయిన కూతురు..ఇలా మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబసభ్యులు ఆసరా కోసం కలెక్టర్‌కు దరఖాస్తుల సమర్పించి ఎదురుతెన్నులు చూస్తున్నారు. అయితే.. బాధిత కుటుంబాల పట్ల కలెక్టరేట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరును పరిశీలిస్తే..బోడిగుండుకు మోకాలి ముడిపెట్టిన చందంగా కనిపిస్తోంది.
విద్యాశాఖకు చెందిన ఉద్యోగి ఒకరు మరణిస్తే.. అతని కుమారునికి ఉద్యోగమిచ్చే విషయంలో విద్యాశాఖ తప్పిదాలపై వివరణ ఇచ్చే వరకు ఉద్యోగం ఇచ్చేది లేదని కలెక్టరేట్ అధికారులు చెపుతుండడం దుర దృష్టకరం. బాధిత కుటుంబాల పట్ల కారుణ్యాన్ని చూపాల్సిన అధికార యంత్రాంగం కఠినంగా వ్యవహరిసున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఏం జరిగిందంటే.. : విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ సబార్టినేట్‌గా పనిచేసిన ఎన్.భిక్షపతి గతేడాది సెప్టెంబరులో మరణించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉండడంతో భిక్షపతి కుమారుడు వినోద్ దరఖాస్తు చేసుకున్నాడు. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగానికి కావాల్సిన విద్యార్హతలు,అవసరమైన ఇతర ధ్రువీకరణ పత్రాలన్నింటిని దరఖాస్తుకు జతపరిచి గతేడాది డిసెంబరులో సమర్పించాడు. తమ పరిధిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు లేనందున జిల్లా యంత్రాంగం అవసరమైన చర్యలు చేపట్టాలని కోరుతూ వినోద్ దరఖాస్తును డీఈవోకు, కలెక్టర్ కు ఈ ఏడాది జూలైలో పంపించారు.
అయితే..జిల్లా విద్యాశాఖ నుంచి తాము కోరిన సమాచారం మూడేళ్లుగా పంపడం లేదని, ఆ విభాగం నుంచి సమాచారం వస్తేనే ఉద్యోగం ఇస్తామని కలెక్టరేట్ అధికారులు మడత పేచీపెట్టారు. జరుగుతున్న తంతుతో బాధిత కుటుంబానికి ఎటువంటి సంబంధం లేకపోయినా.. అధికారుల తీరుతో వేదనకు గురవుతున్నారు. జిల్లాలోని వివిధ విభాగాల్లో ఇబ్బడిముబ్బడిగా జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నా..అధికారులు వాటిని భర్తీ చేయకపోవడంపై సిబ్బంది పెదవివిరుస్తున్నారు.