ఆరో తరగతికే అదరగొడుతున్న బుడతడు..
డల్లాస్ :
చిన్న పిల్లలు ఎప్పుడు ఖాళీ సమయం దొరుకుతుందా.. పుస్తకాలను పక్కన పెట్టి టీవీలు, వీడియో గేమ్‌లు ఆడదామా అని చూస్తుంటారు. కానీ చిన్న వయసులోనే ఓవైపు స్కూల్ విద్యను అభ్యసిస్తూనే, మరోవైపు ఏకంగా రెండు పుస్తకాలను రాసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు 12 ఏళ్ల ఆర్నవ్ కొప్పాల. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న ఆర్నవ్ తల్లిదండ్రులు రీనా, శ్రీనివాస్ కొప్పాలలు తెలుగువారు కావడం విశేషం. టెక్సాస్‌లోని కార్రాల్టన్ పెర్రీ మిడిల్ స్కూల్లో ఆర్నవ్ ఆరో తరగతి చదువుకుంటున్నాడు. ఏడేళ్ల వయసు నుంచే ఆర్నవ్ నవలలు, కథలు రాయడం ప్రారంభించాడు.
పెంటగాన్ స్ప్రింగ్స్, బ్రేకింగ్ బౌండరీస్ పుస్తకాలను రాశాడు. పెంటగాన్ స్ప్రింగ్ అమ్మకాలతో వచ్చిన డబ్బును క్యాన్సర్ బాధితుల కోసం కృషి చేస్తున్న రీసెర్చ్ సంస్థకు విరాళంగా ఇవ్వగా, దానికి సీక్వెల్‌గా వచ్చిన బ్రేకింగ్ బౌండరీస్ అమ్మకాలతో వచ్చిన డబ్బును గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు సహాయపడే ఓ స్వచ్ఛందసంస్థకు విరాళంగా ఇవ్వనున్నట్టు తెలిపాడు. అమెజాన్‌లో ఈ పుస్తకానికి 5 స్టార్ రేటింగ్ రావడం మరో విశేషం.