టీవీలు ధ్వంసం.. పోస్టర్లు దగ్థం
న్యూఢిల్లీ: టీవీలు పగిలాయి.. పోస్టర్లు దగ్థమయ్యాయి.. నినాదాలు హోరెత్తాయి... చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో టీమిండియా చిత్తుగా ఓడిన తర్వాత భారత క్రికెట్ అభిమానుల రియాక్షన్ ఇది. దాయాదుల సమరంలో పోరాడకుండానే కోహ్లి సేన సులువుగా లొంగిపోవడంతో అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మ్యాచ్ ముగిసిన వెంటనే టీమిండియా ఫ్యాన్స్ తమ కోపాన్ని వివిధ రూపాల్లో వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి కోహ్లి సేనకు వ్యతిరేకంగా గళమెత్తారు.
అహ్మదాబాద్‌లో కొంత మంది టీవీలు రోడ్డు మీదకు తెచ్చి బద్దలు కొట్టారు. భారత క్రికెటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్పూర్‌లో కెప్టెన్ కోహ్లి, అశ్విన్, యువరాజ్ సింగ్, ఇతర ఆటగాళ్ల పోస్టర్లను తగలబెట్టారు.
ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో క్రికెట్ ప్రేమికుల ఆగ్రహానికి టీవీలు పగిలిపోయాయి. టీమిండియా సభ్యుల ఆటతీరును నిరసిస్తూ నినాదాలు చేశారు.
రాళ్లదాడి, అవాంఛనీయ సంఘటనలు జరగొచ్చనే అనుమానంతో ముందు జాగ్రత్తగా రాంచిలోని మహేంద్ర సింగ్ ధోని ఇంటి వద్ద భద్రతను పెంచారు. మిగతా ఆటగాళ్ల నివాసాల దగ్గర కూడా భద్రత కట్టుదిట్టం చేసినట్టు సమాచారం.