Breeding birds
-
పట్టణ వాకిట ప్రకృతి సోయగం
పక్షుల పెంపకంపై మక్కువ చూపుతున్న ప్రజలు చేపల ఆక్వేరియంలకు గిరాకీ విభిన్న వ్యాపారానికి ఆదరణ ఊర పిచ్చుకల కిచకిచలు..చిలక పలుకులు..గోరింకల కేరింతలు..ముత్యాలాంటి మీనాల విన్యాసాలు..చెంగు చెంగంటూ దుమికే కుందేళ్ల గెంతుల ప్రకృతి సోయగాలు... పల్లె సీమల సొంతం. నేడు ఆ అందాలన్నీ నగరవాకిటా కనువిందు చేస్తున్నాయి. అది ఎలాంటే.. పంజరాన ఒదిగే లవ్‌బర్డ్స్, పావురాలు, కుందేళ్లు..ఆక్వేరియంలో గిరగిరా బంగారు చేపలు నగరవాసుల ఇళ్ల అలంకరణలుగా దర్శనమిస్తున్నాయి. పక్షుల సవ్వడిపై నగరవాసులు మక్కువ చూపుతుండడంతో ఈ వ్యాపారం మూడు మీనాలు..ఆరు లవ్‌బర్డ్స్‌గా సాగుతోంది. చిత్తూరు(రూరల్):నగరవాసులు వివిధ జాతుల పక్షులు, అందమైన చిన్న, చిన్న జంతువులు, ఆక్వేరియంలో చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో చెన్నై నుంచి తెప్పించిన పంజరాలతో కూడిన చిలుకలు, చేపల ఆక్వేరియంకు ఆదరణ అభించడంతో నగరంలో పలు దుకాణాలు వెలుస్తున్నాయి. వ్యాపారాలు సైతం లాభసాటిగా సాగుతున్నట్లు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వేలూరు మార్గంలో జెడ్పీ కార్యాలయం సమీపంలో ఓ షాపు, సీబీ రోడ్డులో మరోషాపులో, ఇంకా పలుచోట్ల అందమైన రంగుల్లో ఉన్న చేపలతో ఆక్వేరియంలు ఆకట్టుకుంటున్నాయి. ఆక్వేరియంల కోసం ఫ్లవర్ హర్న్, హెర్మో, సిల్వర్ షాక్, సీ ఏంజెల్, గోల్డ్‌ఫిష్, రూకే గోల్డ్, మాలి, టైగర్, వైట్షాక్, బ్లాక్ మోలాస్, లాంగ్‌టైమ్, పెట్రాస్కి గోల్డ్, లూసింగ్, ఫిరానా తదితర రకాల చేపలను చెన్నై నుంచి తెప్పించి, విక్రయిస్తున్నారు. ఆక్వేరియం అడుగున రంగురాళ్లు వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసి, విక్రయిస్తున్నారు. అలాగే ఈ షాపుల్లోనే రంగురంగుల చిలుకలతో నిండిన పంజరాలను విక్రయిస్తున్నారు. పెంచుకునేందుకు కుందేళ్లను, పావురాలను సైతం ఇక్కడ ప్రత్యేక పంజరాల్లో పెట్టి అమ్ముతున్నారు. అలాగే వాటి పోషణ కోసం వినియోగించే మేతను కూడా అక్కడే విక్రయిస్తున్నారు. -
ఈము రైతుల భవిష్యత్తేమిటో?
ఎన్నో ఆశలతో ఈము పక్షుల పెంపకం చేపట్టిన రైతుల కలలు కల్లలయ్యాయి. ప్రచారాన్ని నమ్మి భారీ లాభాలను కళ్ల చూడవచ్చని అప్పులుచేసి, భూమిని తాకట్టు పెట్టి మరీ ఈ రంగంలోకి అడుగుపెట్టిన రైతులు దివాళా తీశారు. ప్రభుత్వం వైపు నుంచి సరైన సహాయ సహకారాలు అందకపోవటం, పూర్తిగా విదేశీ మార్కెట్‌పై ఆశతో స్థానిక మార్కెట్‌ను నిర్లక్ష్యం చేయటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. మార్కెటింగ్ సదుపాయం కల్పించడంపై ప్రభుత్వాలు దృష్టి కేంద్రీకరిస్తేనే ఈము రైతులు నష్టాల్లోంచి బయటపడగలరని అంటున్నారు పుట్టా సోమన్న చౌదరి. ఈము పక్షులు కాదు - డాలర్ల గుడ్లు పెట్టే బంగారు బాతులు.. ఈము పక్షులతో విదేశీ మారక ద్రవ్యం.. ఈము పక్షుల కాలి గోళ్ల నుంచి తల వెంట్రుకల వరకు.. డబ్బే డబ్బు! పదేళ్ల క్రితం.. హోరెత్తిన ప్రచారంలో భాగం ఈ మాటలు. ఈ మాటలు నమ్మిన వేలాది మంది రైతులు వ్యవసాయాన్ని సైతం మానుకొని ఈము పక్షుల పెంపకం చేపట్టి.. నిలువునా మునిగిపోయారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు తమ గోడును పట్టించుకోవటం లేదని అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యల దిశగా పయనిస్తున్న ఈము రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఆస్తులు కుదువ పెట్టి ఆరే ళ్లపాటు పెంచిన ఈము పక్షులు తమ ఆశలు వమ్ము చేశాయని రైతులు ఆక్రోశిస్తున్నారు. జరిగిన నష్టం నుంచి ఎలా బయటపడాలో తెలియక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈము పక్షుల రైతాంగం దిక్కులు చూస్తోంది. పౌల్ట్రీ రంగంలో కొత్త ఆవిష్కరణ అంటూ రెండు దశాబ్దాల కిందట రాష్ట్రంలోకి విదేశాల నుంచి రంగ ప్రవేశం చేసిన ఈము పక్షుల పెంపకం గొలుసుకట్టు వ్యాపార ధోరణితో సాగింది. ఒకరి నుంచి ఒకరు గుడ్లు కొనుగోలు చేసి, వాటి ద్వారా పిల్లలను పొదిగించి అధిక ధరకు అమ్ముకున్నారు. ప్రస్తుతం గుడ్లు కాని పిల్లలు కాని కొనుగోలు చేసేవారే లేకపోవటంతో గొలుసుకట్టు వ్యాపారం చివరి లింకు తె గిపోయిది. దీంతో ఈము పక్షుల పెంపకం దారులు సంక్షోభంలో కూరుకుపోయారు. గుడ్డు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు, ఆ గుడ్డు ద్వారా వచ్చే పిల్లలకైతే మూడు నుంచి నాలుగు వేల రూపాయల ధర పలకడంతో ఇంత వరకు ఈము పక్షుల కేంద్రాలు మూత పడకుండా కొనసాగుతూ వచ్చాయి. ప్రచార పటాటోపమే కొంప ముంచింది మొత్తం పక్షిలో 97 శాతం ఉపయోగపడేదని, కాసులు కురిపించేవేనని ఊదర గొట్టడంతో.. రాష్ట్రంలో ఆర్థిక పుష్టి గల రైతులు ఈము పక్షుల పెంపకం వైపు మొగ్గు చూపారు. ఈము పక్షి గుడ్లు, మాంసం,కొవ్వు, ఈకలు, చర్మం, చివరకు కాలి గోళ్లను కూడా ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. నాబార్డ్ సబ్సిడీతో బ్యాంకులు రుణాలివ్వడంతో పెద్దా, మధ్యతరహా రైతులు తమ వ్యవసాయ భూములను కుదువపెట్టి మరీ ఈ రంగంలోకి దిగారు. ఉభయ గోదావరి, విశాఖ, కృష్ణా జిల్లాల్లోనే 600కు పైగా ఈము పెంపకం కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవవసాయ విశ్వవిద్యాలయం అయితే శిక్షణా కేంద్రాలు కూడా నిర్వహించింది. దీంతో రాష్ట్రంలో ఈము పక్షుల కేంద్రాల సంఖ్య నాలుగు వేలకు, పక్షుల సంఖ్య ఎనిమిది లక్షలకు చేరింది. దేశంలోని ఈము పక్షుల్లో 50 శాతం మన రాష్ట్రంలోనే ఉన్నాయి. ప్రోసెసింగ్ కేంద్రాలు ప్రకటనలకే పరిమితం రాష్ట్రంలో ఎక్కడా ఈము పక్షుల కొవ్వు నుంచి ఆయిల్ తీసే ప్రోసెసింగ్ యూనిట్లు లేకపోయినా పోటీపడి పక్షుల సంఖ్యను పెంచుకుంటూ పోయారు. మెదక్ జిల్లా పటాన్చెరులోనూ, కృష్ణా జిల్లా నూజివీడులోనూ భారీ ఈము ప్రాసెసింగ్ కేంద్రాల ఏర్పాటంటూ ప్రకటనలు తప్ప రైతులకు మాత్రం మేలు జరగలేదు. గుడ్లుపెట్టని పక్షుల వధ కోసం కబేళాల నిర్మాణం కూడా జరగలేదు. గుడ్లను పొదిగి పిల్లల్ని పెంచే కేంద్రాల సంఖ్య కూడా పెరగలేదు. దీనికి తోడు ఈము పక్షుల మాంసంపై వినియోగదారులలోనూ ప్రభుత్వం అవగాహన కల్పించలేదు. ఈ పరిస్థితుల్లో విదే శీ మారక ద్రవ్యం మోజుతోనే తాము పక్షులను పెంచి నష్టపోయామని, కేంద్ర ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలని ఈము పక్షుల పెంపకందార్లు ఎప్పటి నుంచో కోరుతున్నా పట్టించుకున్న నాథుడే లేరు. ఎగుమతులపై చొర వ చూపితే నే ప్రయోజనం.. ఈము పరిశ్రమ నిస్తేజంగా ఉన్న దశలో ఇటీవల ఒక ఆశ మెరిసింది. అమెరికాకు చెందిన ఎల్. బి. ప్రోసెసర్ సంస్థకు కృష్ణా జిల్లా ఈము పక్షుల సంఘానికి మధ్య విజయవాడలో ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఏటా 12 వేల గ్యాలన్ల చొప్పున 5 సంవత్సరాల పాటు ఈము కొవ్వు నూనెను ఆ సంస్థ కొనుగోలు చేస్తుంది. కృష్ణా జిల్లాలోని ఈము నూనె ఉత్పత్తి కేంద్రాన్ని అమెరికా ప్రతినిధుల బృందం సందర్శించి నూనె నాణ్యత పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది. విదేశీ మార్కెట్లను వెతకడంలో ప్రభుత్వం చొరవ చూపితే తప్ప ఈము రైతుల కష్టాలు తీరే పరిస్థితి కనిపించడంలేదు. (వ్యాసకర్త సీనియర్ జర్నలిస్టు (94403 39682)