పక్షుల పెంపకంపై మక్కువ చూపుతున్న ప్రజలు
చేపల ఆక్వేరియంలకు గిరాకీ
విభిన్న వ్యాపారానికి ఆదరణ
ఊర పిచ్చుకల కిచకిచలు..చిలక పలుకులు..గోరింకల కేరింతలు..ముత్యాలాంటి మీనాల విన్యాసాలు..చెంగు చెంగంటూ దుమికే కుందేళ్ల గెంతుల ప్రకృతి సోయగాలు... పల్లె సీమల సొంతం. నేడు ఆ అందాలన్నీ నగరవాకిటా కనువిందు చేస్తున్నాయి. అది ఎలాంటే.. పంజరాన ఒదిగే లవ్‌బర్డ్స్, పావురాలు, కుందేళ్లు..ఆక్వేరియంలో గిరగిరా బంగారు చేపలు నగరవాసుల ఇళ్ల అలంకరణలుగా దర్శనమిస్తున్నాయి. పక్షుల సవ్వడిపై నగరవాసులు మక్కువ చూపుతుండడంతో ఈ వ్యాపారం మూడు మీనాలు..ఆరు లవ్‌బర్డ్స్‌గా సాగుతోంది.
చిత్తూరు(రూరల్):నగరవాసులు వివిధ జాతుల పక్షులు, అందమైన చిన్న, చిన్న జంతువులు, ఆక్వేరియంలో చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. దీంతో చెన్నై నుంచి తెప్పించిన పంజరాలతో కూడిన చిలుకలు, చేపల ఆక్వేరియంకు ఆదరణ అభించడంతో నగరంలో పలు దుకాణాలు వెలుస్తున్నాయి. వ్యాపారాలు సైతం లాభసాటిగా సాగుతున్నట్లు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని వేలూరు మార్గంలో జెడ్పీ కార్యాలయం సమీపంలో ఓ షాపు, సీబీ రోడ్డులో మరోషాపులో, ఇంకా పలుచోట్ల అందమైన రంగుల్లో ఉన్న చేపలతో ఆక్వేరియంలు ఆకట్టుకుంటున్నాయి.
ఆక్వేరియంల కోసం ఫ్లవర్ హర్న్, హెర్మో, సిల్వర్ షాక్, సీ ఏంజెల్, గోల్డ్‌ఫిష్, రూకే గోల్డ్, మాలి, టైగర్, వైట్‌షాక్, బ్లాక్ మోలాస్, లాంగ్‌టైమ్, పెట్రాస్కి గోల్డ్, లూసింగ్, ఫిరానా తదితర రకాల చేపలను చెన్నై నుంచి తెప్పించి, విక్రయిస్తున్నారు. ఆక్వేరియం అడుగున రంగురాళ్లు వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసి, విక్రయిస్తున్నారు. అలాగే ఈ షాపుల్లోనే రంగురంగుల చిలుకలతో నిండిన పంజరాలను విక్రయిస్తున్నారు. పెంచుకునేందుకు కుందేళ్లను, పావురాలను సైతం ఇక్కడ ప్రత్యేక పంజరాల్లో పెట్టి అమ్ముతున్నారు. అలాగే వాటి పోషణ కోసం వినియోగించే మేతను కూడా అక్కడే విక్రయిస్తున్నారు.
పట్టణ వాకిట ప్రకృతి సోయగం
Published Sat, Jul 4 2015 1:56 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 AM
Advertisement
Advertisement