మెకల్లమ్ మెరుపులు
మొహాలీ: చాంపియన్స్ లీగ్ టి20 క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో న్యూజిలాండ్ దేశవాళీ జట్టు ఒటాగో వోల్ట్స్ శుభారంభం చేసింది. బ్రెండన్ మెకల్లమ్ (65 బంతుల్లో 83 నాటౌట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్‌కు తోడు డి బూర్డర్ (28 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్సర్) సమయోచితంగా రాణించడంతో తొలి మ్యాచ్‌లో ఒటాగో వోల్ట్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఫైసలాబాద్ వోల్వ్స్ (పాకిస్థాన్)పై విజయం సాధించింది.
పీసీఏ స్టేడియంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచిన ఫైసలాబాద్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులు చేసింది. మిస్బా (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), కుర్రమ్ షెహజాద్ (36 బంతుల్లో 27; 3 ఫోర్లు) రాణించారు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును ఈ ఇద్దరు నాలుగో వికెట్‌కు 61 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే వోల్ట్స్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో మిస్బా సేన కోలుకోలేకపోయింది.
ఆసిఫ్ అలీ (14) కాసేపు పోరాడాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఒటాగో వోల్ట్స్ 17.5 ఓవర్లలో 2 వికెట్లకు 142 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ బ్రూమ్ (0) నిరాశపర్చినా... రూథర్‌ఫోర్డ్ (12 బంతుల్లో 25; 1 ఫోర్, 3 సిక్సర్లు) చెలరేగాడు. అయితే అంతవరకు నిలకడకు ప్రాధాన్యమిచ్చిన మెకల్లమ్ ఆ తర్వాత ఫైసలాబాద్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. రెండో వికెట్‌కు రూథర్‌ఫోర్డ్‌తో కలిసి 41 పరుగులు జోడించాడు. 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ మెకల్లమ్ తర్వాత కూడా అదే జోరును కనబర్చాడు.
స్కోరు వివరాలు
ఫైసలాబాద్ వోల్వ్స్ ఇన్నింగ్స్: అమర్ మహమూద్ (సి) బ్రూమ్ (బి) మెక్‌మిలన్ 5; అలీ వకాస్ (సి) రూథర్ ఫోర్డ్ (బి) మెక్‌మిలన్ 4; కుర్రమ్ షెహజాద్ (సి) వాంగర్ (బి) బట్లర్ 27; ఆసిఫ్ అలీ (సి) బియర్డ్ (బి) నీషమ్ 14; మిస్బా (బి) బట్లర్ 46; ఇమ్రాన్ ఖాలిద్ (సి) వాంగర్ (బి) నీషమ్ 12; సల్మాన్ (సి) డి బూర్డర్ (బి) వాంగర్ 10; అజ్మల్ నాటౌట్ 9; ఎహ్సాన్ ఆదిల్ రనౌట్ 4; అసద్ అలీ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139
వికెట్లపతనం: 1-5, 2-12, 3-34, 4-95, 5-108, 6-117, 7-127, 8-136
బౌలింగ్: బట్లర్ 4-0-23-2; మెక్‌మిలన్ 4-0-24-2; వాంగర్ 4-0-25-1; నీషమ్ 4-0-26-2; బియార్డ్ 2-0-12-0; నాథన్ మెకల్లమ్ 2-0-26-0
ఒటాగో వోల్ట్స్ ఇన్నింగ్స్: బ్రూమ్ (సి) షెహజాద్ (బి) సయీముల్లా 0; రూథర్‌ఫోర్డ్ (సి) ఆసిఫ్ అలీ (బి) అజ్మల్ 25; మెకల్లమ్ నాటౌట్ 83; బూర్డర్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం: (17.5 ఓవర్లలో 2 వికెట్లకు) 142
వికెట్లపతనం: 1-0, 2-41
బౌలింగ్: సయీముల్లా 3-0-18-1; అసద్ 2.5-0-29-0; షెహజాద్ 2-0-19-0; అజ్మల్ 4-0-23-1; ఖాలిద్ 4-0-32-0; ఆదిల్ 2-0-19-0.
చాంపియన్స్ లీగ్‌లో నేడు
క్వాలిఫయింగ్ మ్యాచ్‌లు
కందురతా మారూన్స్ x ఫైసలాబాద్ వోల్వ్స్
సాయంత్రం గం. 4.00 నుంచి
హైదరాబాద్ సన్‌రైజర్స్ x ఒటాగో వోల్ట్స్
రాత్రి గం. 8.00 నుంచి
స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం