Brick factories
-
అక్రమ దందా!
చుంచుపల్లి: జిల్లాలో ఇటుకబట్టీల అక్రమ వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లోపం ఇటుక వ్యాపారులకు కలిసివస్తోంది. వివిధ శాఖల అనుమతితో బట్టీలను నిర్వహించాల్సి ఉండగా.. జిల్లాలో పలువురు వ్యాపారులు ఆ నిబంధనలను గాలికొదిలేశారు. ఇది లాభసాటి వ్యాపారం కావడంతో పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతుండటంతో అందరి దృష్టీ ఈ వ్యాపారంపైనే పడింది. జిల్లాలో ప్రతి మండలంలో రెండు, మూడు చొప్పున ఇటుకబట్టీలు వెలిశాయి. ఇందులో 42 బట్టీలు అనుమతి లేకుండా నడుస్తున్నాయని అధికారులే చెపుతున్నారు. వీటిలో 15 నుంచి 20 వరకు జిల్లా కేంద్రమైన కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లోనే ఉండడం గమనార్హం. బట్టీల నిర్వహణకు ఒడిశా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి కూలీలను తీసుకొచ్చి, వారితో వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. విచ్చలవిడిగా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలతో పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇటుకను కాల్చడానికి అడవుల్లోని కలపతో పాటు సింగరేణి బొగ్గును కూడా అక్రమంగా వినియోగిస్తున్నారు. వ్యవసాయ భూముల్లోనే నిర్వహణ.. జిల్లాలో ఇటుక బట్టీల నిర్వహణకు వ్యాపారులు అవలంబిస్తున్న విధానాలన్నీ అక్రమంగానే ఉన్నాయి. బట్టీ ఏర్పాటు చేయాలంటే ఆయా పంచాయతీల పరిధిలో రెవెన్యూ శాఖ అనుమతి తప్పనిసరి. జిల్లాలో ఎక్కువ శాతం అటవీ ప్రాంతాలకు సమీపంలో వ్యవసాయ భూముల్లోనే వీటిని నిర్వహిస్తున్నారు. ఇక ఏజెన్సీ ప్రాంతాల్లోని భూములను వినియోగించవద్దనే నిబంధన ఉన్నప్పటికీ.. గిరిజన రైతుల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని వారికి కొంత డబ్బును ముట్టజెప్పి తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారు. ఆ భూములను వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నందున నాలా సుంకం చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు భూగర్భ, గనులు, అటవీశాఖ అనుమతులు పొందాలి. కానీ జిల్లాలో ఎక్కడా సుంకం చెల్లించిన దాఖలాలు లేవు. పైగా ప్రస్తుతం ఉన్న ఇటుకబట్టీలకు అనుమతి కూడా తీసుకోవడం లేదు. ముందుగానే తహసీల్దార్, కాలుష్య నియంత్రణ అధికారి నుంచి అనుమతి పొందాలి. ఇవేమీ లేకపోగా ప్రభుత్వ స్థలాలు, అంబ సత్రం భూములు, అటవీ భూములు వినియోగిస్తున్నారు. దీంతో పాటు వాల్టా చట్టాన్ని ఉల్లంఘించి వాగులు, చెరువుల్లో గోతులు తవ్వుతూ ఇటుకల కోసం మట్టిని తరలిస్తున్నారు. వీటిని పరిశీలించి మండలాల స్థాయిలో చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ సిబ్బంది ‘మామూలు’గానే వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక, మొరం లాగే ఇటుకల తయారీకి వినియోగించే మట్టి తవ్వకాలకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. అందుకు పన్ను(రాయల్టీ) చెల్లించాల్సి ఉంది. ఇది కూడా ఎక్కడా అమలుకావడం లేదు. ఏటా రూ.50 లక్షల మేర గండి.. ప్రభుత్వం ఏజెన్సీలో రైతుల సేద్యానికి బోరు మోటార్లకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తోంది. దీనిని ఆసరా చేసుకుని వ్యాపారులు ఇటుకల తయారీ కేంద్రం వద్ద బోరు వేసుకుని బట్టీలను నిర్వహిస్తున్నారు. దీనికి విద్యుత్ కనెక్షన్ కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలి. అందుకు రెండు నెలలకు రూ.8 వేల వరకు విద్యుత్ శాఖకు చెల్లించాలి. అయితే బట్టీల వ్యాపారులు సమీప వ్యవసాయ భూములు, బోరు మోటార్లను లీజుకు తీసుకుంటూ రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు కూడా చూసీ చూడనట్టుగానే వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. విద్యుత్ వినియోగం, పన్నుల రూపంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వానికి ఏటా రూ.50 లక్షల మేర గండి పడుతోంది. అనుమతులు లేని ఇటుకబట్టీలపై చర్య తీసుకుంటాంజిల్లాలో అనుమతి లేని, అక్రమ ఇటుక బట్టీల నిర్వహణపై తక్షణ చర్యలు తీసుకోవాలని తహసీల్దార్లకు ఆదేశాలిస్తాం. ఆయా మండల పరిధిలో ప్రతి తహసీల్దార్ అక్రమ ఇటుకబట్టీల విషయంలో కఠినంగా వ్యవహరించేలా చూస్తాం. ఇటుక బట్టీల నిర్వహణ నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సంబంధిత వ్యాపారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం. – స్వర్ణలత, కొత్తగూడెం ఆర్డీఓ -
అక్రమ ఇటుక బట్టీలు
► నిబంధనలు బేఖాతరు ► ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్న వ్యాపారులు ► పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్ టౌన్ : ఆదిలాబాద్ నియోజక వర్గంలో ఇటుక బట్టీలు ఇష్టారీతిగా వెలుస్తున్నాయి. ఇటుకలకు పెరుగుతున్న డిమాండ్‌తో ఆయా మండలాల్లో ఎక్కడపడితే అక్కడ పుట్టగొడుగుల్లా బట్టీలు వెలుస్తున్నాయి. ప్రజలు నివసించే ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుకలను తయారు చేయాలని నిబంధనలు ఉన్నా వాటిని వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో ఎలాంటి అనుమతులు లేకుండా బట్టీలను ఏర్పాటు చేస్తున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో 1/ 70 చట్టం ప్రకారం తవ్వడానికి వీలు లేనప్పటికీ అవేం పట్టకుండా గ్రామాల్లో లక్షల వ్యాపారం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఇటుకల తయారీ చేయడంతో వాతావరణం కాలుష్యమవుతుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రూ. లక్షల్లో గండి.. ఆదిలాబాద్ రూరల్, మావల మండలంలోని బట్టీసావర్గాం, బంగారుగూడ, మావల, అంకోలి, తంతోలి, చించూగాట్, యాపల్‌గూడ, జైనథ్ మండలంలోని పెన్ గంగా సమీపంలోని డోలార వద్ద ఇటుకల వ్యాపారం జోరుగా సాగుతోంది. ఇటుకల విక్రయాలతో ప్రధానంగా వాణిజ్య పన్నుల శాఖ ఎక్కువగా ఆదాయం కోల్పోతుంది. సంవత్సరానికి రూ. లక్షల్లో నష్టపోవాల్సివస్తోంది. ఒక్కో ఇటుకకు రూ. 3 చొప్పన వ్యాపారులు వసూలు చేస్తున్నా చాలామంది వ్యాపారులు ప్రభుత్వానికి నయాపైసా కూడా చెల్లించడం లేదు. వ్యాపారులు 5 శాతం వ్యాట్ చెల్లించడం గాని, అనుమతులు పొందడం లాంటివి చేయడంలేదు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి పెద్ద మొత్తంలో గండిపడుతోంది. ఇటుకల తయారీకి మట్టి అవసరం. చేన్లో, గుట్టల్లో, అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వి ఇటుకలు తయారు చేస్తున్నారు. మట్టిని తవ్వాలంటే భూగర్భ శాఖ, గ్రామపంచాయతీ అనుమతి కూడా ఉండాలి. ఆదిలాబాద్ రూరల్, మావల మండలాల్లో కుప్పలు తెప్పలుగా ఇటుక బట్టీలు వెలసినా ఏ ఒక్కదానికి అనుమతులు లేదని తెలుస్తోంది. ఇటుకలు విక్రయించాక అమ్మకం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం విలువ అధారిత పన్ను (వ్యాట్) వీటికి ఐదుశాతం ఉంది. ఈ విక్రయాలకు పన్ను చెల్లించాల్సి ఉన్నా అది కూడా అమలు కావడం లేదు. పట్టించుకోని అధికారులు జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో అనుమతి లేని ఇటుక బట్టీలు వెలుస్తున్నా సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మట్టికోసం గుట్టలను తవ్వుతున్నా అటవీశాఖ అధికారుల్లో చలనం కన్పించడం లేదు. రోజురోజుకు ఈ వ్యాపారం ఊపందుకుంటున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులుస్పందించి ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలి్సన అవసరం ఉందని పలువురు పేర్కొంటున్నారు. బట్టీల్లో మగ్గుతున్న బాల్యం 6–14 సంవత్సరాల లోపు పిల్లలంతా విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లోనే ఉండాలి. కానీ ఇటుకలు తయారు చేసే కార్మికుల పిల్లల బాల్యం బట్టీల్లోనే మగ్గుతోంది. తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా మట్టి పనిలోనే నిమగ్నమవుతున్నారు. విద్యాశాఖ, కార్మిక శాఖ అధికారుల పట్టింపు లేనితనంతో వారి బాల్యం బుగ్గిపాలవుతోంది. ఆ ప్రాంతంలో ప్రత్యామ్నాయ పాఠశాలలు లేక పోవడంతో చదువుకు దూరమవుతున్నారు. చర్యలు తీసుకుంటాం ఇటుక వ్యాపారం కొనసాగించాలంటే గ్రామపంచాయతీతో పాటు మైనింగ్ శాఖ అధికారుల అనుమతి తీసుకోవాలి. అనుమతులు లేకుండా ఇటుక బట్టీల నిర్వహణ కొనసాగిస్తే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. అనుమతులు లేకుండా ఇటుక వ్యాపారం సాగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారి వివరాలు సేకరించాం. నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. – శ్రీదేవి, ఆదిలాబాద్ రూరల్ తహసీల్దార్