ప్రొటోకాల్ ఉల్లంఘన
ఎంపీ పొంగులేటికి తెలపకుండా బ్రిడ్జి శంకుస్థాపన
అధికారుల తీరుపై విమర్శలు
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల శాఖ అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం బ్రిడ్జి శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాన్ని నిర్వహించారు. జాతీయ రహదారుల పరిధిలోకి వచ్చే ఈ పనులను మంగళవారం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చిన పనులకు ప్రత్యేకంగా స్థానిక పార్లమెంటు సభ్యుడికి సమాచారం ఇవ్వాలి. బ్రిడ్జికి సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకంపై ప్రత్యేకంగా ఎంపీ పేరు పేర్కొన్నా... ఆయనకు మాత్రం ఆహ్వానం ఇవ్వకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీనిపై ఎన్‌హెచ్ ఎస్ఈ వసంత వివరణ ఇస్తూ.. అధికారులు ఎంపీకి సమాచారం ఇచ్చేందుకు పలుమార్లు ఫోన్ చేశారని, ఆయన ఫోన్ ‘నాట్ రీచబుల్’ అని వచ్చిందని తెలిపారు.