'కృష్ణా జలాలపై న్యాయ నిపుణులతో చర్చిస్తాం'
- రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటాం
- మంత్రి దేవినేని ఉమా
మచిలీపట్నం : కృష్ణా జలాల పంపకంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో న్యాయనిపుణులతో చర్చించి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
జెడ్పీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి నీటి పంపకాల విషయంలో 2004లో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి నీరు తరలింపులో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించామన్నారు. జిల్లాలో దాళ్వా సాగుకు నీటి విడుదలపై ఇరురాష్ట్రాల జలవనరుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన అనంతరం నీటి విడుదల విషయం ప్రకటిస్తామని వెల్లడించారు. సమావేశంలో పెడన శాసన సభ్యుడు కాగిత వెంకట్రావు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఈడ్పుగంటి వెంకట్రామయ్య, బంటుమిల్లి మార్కెట్ యార్డు చైర్మన్ వాటాల నరసింహస్వామి పాల్గొన్నారు.