Brisbane Open title
-
సానియా జోడీ.. సాధించెన్
బ్రిస్బేన్: అదే జోరు..అదే ఫలితం. గతేడాది అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సానియా మీర్జా(భారత్)-మార్టినా హింగిస్(స్విట్జర్లాండ్)ల జోడీ ఈ సీజన్ ను కూడా టైటిల్ తో శుభారంభం చేసింది. బ్రిస్బేన్ ఓపెన్ మహిళల డబుల్స్ విభాగంలో శనివారం జరిగిన ఫైనల్ పోరులో సానియా-హింగిస్ ల ద్వయం 7-5, 6-1 తేడాతో ఎంజెలిక్ కెర్బర్-ఆండ్రియా పెట్కోవిచ్ (జర్మనీ) జంటపై విజయం సాధించి టైటిల్ ను ఖాతాలో వేసుకుంది. తొలి సెట్ లో కాస్త ప్రతిఘటన ఎదుర్కొన్న ఈ వరల్డ్ నంబరవన్ జోడీ.. ఆ తరువాత రెండో గేమ్ ను మాత్రం ఎటువంటి అవకాశం ఇవ్వకుండా చేజిక్కించుకుంది. ఇది సానియా-హింగిస్ జంటకిది వరుసగా 26వ విజయం. దీంతో 2012లో సారా ఎరాని-రొబెర్టా విన్సీ (ఇటలీ) జంట వరుసగా 25 మ్యాచ్‌ల్లో గెలిచిన రికార్డును సానియా-హింగిస్ జోడీ బ్రేక్ చేసింది. ఇదిలా ఉండగా ఈ ఇద్దరి కలిసి సాధించిన టైటిల్స్ సంఖ్యను 10కు పెంచుకుంది. -
అజరెంకాదే టైటిల్
బ్రిస్బేన్: మాజీ ప్రపంచ నంబర్‌వన్ టెన్నిస్ క్రీడాకారిణి విక్టోరియా అజరెంకా కొత్త ఏడాదిని ఘనంగా ఆరంభించింది. బ్రిస్బేన్ ఓపెన్ మహిళల సింగిల్స్ లో భాగంగా శనివారం జరిగిన తుదిపోరులో అజరెంకా విజేతగా నిలిచింది. ఆద్యంత ఆకట్టుకున్న అజరెంకా 6-3, 6-1 తేడాతో జర్మనీ క్రీడాకారిణి ఎంజెలిక్ కెర్బర్ బోల్తాకొట్టించి టైటిల్ ను కైవసం చేసుకుంది. ఒక గంటా 13 నిమిషాలపాటు జరిగిన అంతిమ పోరులో అజరెంకా వరుస సెట్లను గెలిచి కెర్బర్ పై మరోసారి పైచేయి సాధించింది. అంతకుముందు వీరిద్దరూ తలపడిన ఐదు సార్లు అజరెంకానే విజయం సాధించింది. ఇదిలా ఉండగా 2013 ఆగస్టు తరువాత అజరెంకాకు ఇదే తొలి టైటిల్. 2014 లో గాయం కారణంగా కేవలం తొమ్మిది టోర్నమెంట్లలోనే అజరెంకా పాల్గొంది. ఆ తరువాత 2015 లో తొడ కండరాల గాయం కారణంగా పలు టోర్నీల్లో వైఫల్యం చెందడంతో ఆమె ర్యాంకింగ్స్ లో గణనీయంగా కిందికి పడిపోయింది. 2016 సీజన్ ను టైటిల్ తో శుభారంభం చేసిన అజరెంకా.. త్వరలో జరిగే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అగ్రశ్రేణి క్రీడాకారిణులు సవాల్ గా మారే అవకాశం ఉంది.