ముగిసిన పోలింగ్
మధ్యాహ్నానికి బ్రిటన్ ఫలితాలు
లండన్: బ్రిటన్ పార్లమెంటుకు గురువారం పోలింగ్ ముగిసింది. మూడేళ్లు ముందస్తుగా జరిగిన ఎన్నికల్లో ప్రజలు భారీగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల మాంచెస్టర్, లండన్లలో ఉగ్రవాదుల దాడుల అనంతరం ఈ ఎన్నికలు జరుగుతుండటంతో పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. 2016లో బ్రెగ్జిట్ (ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ వైదొలగడం)పై రెఫరెండంలో తీర్పు ఫలితంగా డేవిడ్ కామెరాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయగా, థెరిసా మే పీఠమెక్కారు. షెడ్యూల్ ప్రకారమైతే తర్వాతి ఎన్నికలు 2020లో జరగాల్సి ఉంది.
అయితే పార్లమెంటులో తన బలం పెంచుకొని అనంతరం సమర్థవంతంగా బ్రెగ్జిట్ చర్చలను సాగించేందుకు థెరిసా మే మూడేళ్లు ముందుగానే ఎన్నికలకు పిలుపునిచ్చారు. థెరిసా మే తన భర్తతో కలిసి మెయిడెన్హెడ్ నియోజకవర్గంలోను, ఆమె ప్రత్యర్థి లేబర్ పార్టీ అధ్యక్షుడు జెరిమే కార్బిన్ లండన్‌లోని హల్లొవేలోను ఓటు వేశారు. మొత్తం 40 వేల పోలింగ్ బూత్‌లలో 650 ఎంపీ స్థానాలకు ఓటింగ్ జరిగింది. అధికారం చేపట్టాలంటే కనీసం 326 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. బ్రిటన్‌లోని మొత్తం ఓటర్ల సంఖ్య 4.69 కోట్లు కాగా వీరిలో భారత సంతతి ఓటర్లు 15 లక్షల మంది ఉంటారని అంచనా. ఒపీనియన్ పోల్స్ అన్నీ థెరిసా మే గెలుస్తుందని అంచనా వేశాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం కల్లా పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి.