విజేందర్.. ఇప్పటికీ పిల్లాడివే..!
న్యూఢిల్లీ: తనతో భవిష్యత్తులో బాక్సింగ్ రింగ్‌లో పోటీపడేందుకు సిద్ధంగా ఉన్నట్లు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై బ్రిటిష్ బాక్సర్ అమీర్ ఖాన్ స్పందించాడు. వరుస బౌట్లలో విజయాలతో దూసుకెళ్తోన్న విజేందర్‌ను చిన్నపిల్లాడితో పోల్చుతూ ట్వీట్ చేశాడు. విజేందర్ తన కోరిక(అమీర్‌తో బౌట్) విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. అంటే తనతో పోటీపడితే ఓడిపోవతావని పరోక్షంగా అమీర్ ట్విట్టర్ ద్వారా హెచ్చరించాడు.
తొలిసారి టైటిల్ నెగ్గిన విజేందర్కు శుభాకాంక్షలు తెలిపాడు. అభినందనతో పాటు విజేందర్ కు హెచ్చరికలు పంపాడు. పాక్ సంతతికి చెందిన అమీర్, విజేందర్ వెయిట్ కేటగిరిలు వేర్వేరు కావడంతో ఇప్పట్లో ఇద్దరి మధ్య మ్యాచ్ జరిగే అవకాశం లేదు. డబ్ల్యూబీఏ లైట్‌వెయిట్ ప్రపంచ చాంపియన్‌గా ఉన్న అమీర్, ఒలింపిక్స్‌లో ఓ రజతం కూడా సాధించాడు. గత శనివారం రాత్రి ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ బౌట్లో తాను సాధించిన అద్భుత విజయాన్ని బాక్సింగ్ గ్రేట్ మొహమ్మద్ అలీకి అంకితమిచ్చిన విజేందర్.. అమీర్ తో పోరుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు.
Congratulations to @boxervijender on the win. Careful what you wish for kid! https://t.co/HUwvjMeQCL
— Amir Khan (@amirkingkhan) 18 July 2016