మనోళ్లకే మూడు పతకాలు
షెఫీల్డ్ (లండన్): బ్రిటిష్ జూనియర్ ఓపెన్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాళ్లు పతకాలతో మెరిశారు. అండర్–19 కేటగిరీలో సెంథిల్ (స్వర్ణం), అభయ్ (రజతం), ఆదిత్య (కాంస్యం) క్లీన్‌స్వీప్ చేశారు. శనివారం జరిగిన ఫైనల్లో వెలవన్ సెంథిల్ కుమార్ 15–13, 11–2, 10–12, 11–7తో అభయ్ సింగ్‌పై చెమటోడ్చి నెగ్గాడు. తద్వారా ఈ టోర్నీలో టైటిల్ నెగ్గిన మూడో భారత ఆటగాడిగా సెంథిల్ ఘనత సాధించాడు. 1970లో అనిల్ నాయర్ మొదటిసారిగా విజేతగా నిలువగా... మరో పతకాన్ని సౌరవ్ ఘోషల్ సాధించిపెట్టాడు.
ఆరేళ్ల క్రితం జాతీయ స్థాయి అండర్–15 టోర్నీలో అంతంత మాత్రం ఆడిన ముగ్గురు కుర్రాళ్లు ఇప్పుడు పతకాలు గెలవడంపై కోచ్ సైరస్ పోంచా సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటమితో గుణపాఠాలు నేర్చుకున్న ఈ ముగ్గురు పట్టుదలతో, అంకితభావంతో ఇప్పుడు పతకాలు సాధించారని ప్రశంసించారు.