గడ్డం మహిళ గిన్నిస్ రికార్డు
లండన్: మగవాళ్లు కాస్త గడ్డం ఎక్కువ పెంచగానే ఎంట్రా దేవదాసులా మారిపోయావా ఏంటి అని ఫ్రెండ్స్ ఆటపట్టిస్తుంటారు. ఈ మధ్యకాలంలో చాలామంది గడ్డం పెంచేస్తున్నారు. మగవాళ్లు గడ్డం పెంచితే అందులో వింతేమి ఉండదు.. అయితే అదే ఆడవాళ్లు గడ్డం పెంచడం.. ఏకంగా గిన్నిస్ రికార్డులో చోటు దక్కించుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది కదండీ. బ్రిటన్కు చెందిన సిక్కు మోడల్ హర్నామ్ కౌర్. ఆగ్నేయ ఇంగ్లండ్ బెర్క్ షైర్ ప్రాంతంలో ఆమె నివాసం ఉంటోంది. అయితే ఆమె ఏకంగా ఆరు అంగుళాల పొడవుగా గడ్డం పెంచేసింది.
ఆమెను చూసిన వాళ్లు ఔరా అని అశ్చర్యపోతుంటారు. ఈ విషయాన్ని తెలుసుకుని గిన్నిస్బుక్ వాళ్లూ ఆమెకు రికార్డు ఇచ్చేశారు. అతి పిన్న వయసు (24 ఏళ్ల 282 రోజులు)లో ఇలా భారీ స్థాయిలో గడ్డం పెంచిన మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు గిన్నిస్ వారు ప్రశంసాపత్రం అందజేశారు. గిన్నిస్ బుక్లో తన పేరు నమోదు కావడంపై ఆమె హర్షం వ్యక్తం చేసింది. 2016తన జీవితంలో మరిచిపోలేని ఏడాది అని, గత మార్చిలో లండన్ ఫ్యాషన్ వీక్ లో గడ్డంతో పాల్గొన్న తొలి మహిళా మోడల్ తానని వెల్లడించింది.
గడ్డం కథ ఇదే..
చిన్నప్పటి నుంచి హర్నామ్ కౌర్ పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడుతోంది. దీని కారణంగా పురుషులకు వచ్చినట్లే ఆమెకు యుక్త వయసు రాగానే మీసం, గడ్డం వస్తున్నాయి. ఇది చూసి ఆమె తోటివాళ్లు ఆటపట్టించేవారు. అయినా సరే ఏదైనా సాధిస్తానని ఆత్మవిశ్వాసంతో నలుగురిలో ధైర్యంగా తిరగటం అలవాటు చేసుకుంది. గిన్నిస్ రికార్డుతో తన ఆత్మవిశ్వాసం రెట్టింపయిందని, తాను ఏదైనా సాధించగలనని మోడల్ హర్నామ్ కౌర్ ధీమా వ్యక్తం చేసింది.