మహిళా రాజకీయ నేపథ్యంలో బ్రోకర్-2
నేటి రాజకీయాల్లో మహిళల పాత్ర ఏంటి? వారిని పావుల్లా ఎలా వాడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానంగా రూపొందుతోన్న చిత్రం ‘బ్రోకర్-2’. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రాన్ని మద్దినేని రమేష్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
70 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి రమేష్ మాట్లాడుతూ- ‘‘మహిళలు, రాజకీయాలు అనే రెండు అంశాలతో పాటు కావల్సినన్ని వాణిజ్య అంశాలు కూడా ఈ కథలో ఉంటాయి. గతంలో వచ్చిన ‘బ్రోకర్’ చిత్రానికి కొనసాగింపు ఈ సినిమా. అయితే... ఆ సినిమాకు, ఈ సినిమాకు కథ పరంగా చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ నెలలోనే మిగతా టాకీతో పాటు అయిదు పాటల చిత్రీకరణను పూర్తి చేస్తాం.
నవంబర్లో పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నూతన నటి స్నేహ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జీవా, బెనర్జీ, సిరి, కాదంబరి కిరణ్, ప్రభు, గిరి, శోభ ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: యార్లగడ్డ నాగేంద్రదేవ్, శ్రీని తేరాల, పాటలు: చైతన్య ప్రసాద్, ఛాయాగ్రహణం: వెంకట్, సమర్పణ: వెంకట్ వర్థినేని.