జియోకు లభించే ఆదరణ ఏ రేంజ్ లో ఉందంటే...
న్యూఢిల్లీ : ఉచిత ఆఫర్లతో ఇన్ని రోజులు వినియోగదారులను మైమరిపించిన రిలయన్స్ జియో ఛార్జీల బాదుడుకు సిద్ధమవుతోంది. 2017 ఏప్రిల్ నుంచి టారిఫ్ ప్లాన్స్ అమలు చేయనున్నట్టు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. అయితే ఛార్జీల వసూల తర్వాత నుంచి చాలామంది జియో సిమ్ సబ్స్క్రైబింగ్ ను ఆపివేస్తారంటూ పలు రూమర్లు మార్కెట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదెంత నిజమో తెలుసుకోవడం కోసం బ్రోకరేజ్ సంస్థ బెర్న్ స్టెయిన్ ఓ రీసెర్చ్ నిర్వహించింది. ఈ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైంది.
కస్టమర్ మన్ననలను పొందడంలో రిలయన్స్ జియో అత్యధిక స్కోర్ నమోదుచేసిందని, ఇంక్యుబెంట్లను మించి కస్టమర్ సర్వీసు, అనుకూలత, డేటా కవరేజ్, డేటా స్పీడ్, హ్యాండ్ సెట్ ఛాయిస్ లో ఇది మంచి పేరును సంపాదించుకుంటుందని వెల్లడైంది. జియో ఉచిత ఆఫర్లను చాలామంది మెచ్చుకుంటారని కానీ వాయిస్ క్వాలిటీ, ఛార్జీల బాదుడు విషయంతో చాలామంది తమ ప్రైమరీ ఆపరేటర్ కు వెళ్తారని చెప్తారేమో అనుకున్నామని బెర్న్ స్టెయిన్ తెలిపింది. కానీ రీసెర్చ్ లో ట్రెండ్ రివర్స్ గా నమోదైనట్టు పేర్కొంది. వాయిస్ క్వాలిటీ, వాయిస్ కవరేజ్ లో వొడాఫోన్, ఐడియాలను మించి జియో మంచి ప్రదర్శనను కనబర్చిందని రీసెర్చ్ వెల్లడించింది.
నెలకు రూ.303 ఛార్జీ వసూల చేయడం ప్రారంభించిన తర్వాత కూడా 67 శాతం మంది యూజర్లు తాము కలిగిన ఉన్న జియో సెకండరీ సిమ్ ను అలాగే వాడుతామని పేర్కొన్నారు. వారిలో 63శాతం మంది కొత్త ప్రైమరీ ఆపరేటర్ గా తమ జియోను మార్చుకోవాలనేది ప్లాన్ అని చెప్పారు. మిగతా 28 శాతం మంది సెకండ్ సిమ్ గానే జియోను కొనసాగిస్తామని పేర్కొన్నారు. కేవలం 2 శాతం మంది జియో యూజర్లు మాత్రమే తమ సిమ్ వాడకాన్ని నిలిపివేస్తామని తెలిపారు. అది కూడా జియోకు సమానంగా మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలు ఆఫర్లిస్తే వాటిని వాడతామని చెప్పారు.
జియో ఛార్జీల వసూల బాదుడు తర్వాత ఎంత మంది ఆ సిమ్ ను వాడతారనే దానిపైనే ఈ రీసెర్చ్ ఎక్కువగా ఫోకస్ చేసింది. ఈ రీసెర్చ్ లో కూడా ఉచిత ఆఫర్లను ఇవ్వకపోయినా కస్టమర్ల మన్ననలను జియోకు అలాగే ఉంటాయని వెల్లడైంది. మొత్తం వెయ్యిమంది శాంపుల్స్ డేటాతో బెర్న్ స్టెయిన్ ఈ రీసెర్చ్ ను చేపట్టింది. రీసెర్చ్ లో పాల్గొన్న వారిలో 40 శాతం మంది మెట్రో సిటీలకు చెందిన వారు కాగ, 30 శాతం మంది ఏ-సర్కిల్స్, 20 శాతం మంది బి-సర్కిల్స్, 10 శాతం మంది సీ-సర్కిల్స్ కు చెందిన వారు.