Brother Shafi
-
నీకోసం నీవే చదివి ఎదగాలి
నిజామాబాద్‌నాగారం(నిజామాబాద్‌అర్బన్): నీ కోసం నీవే చదివి జీవితంలో ఎదగాలని, అమ్మానాన్నల కోసమో, స్నేహితుల కోసమో, బంధువుల కోసమో, చుట్టు పక్కల వారికోసమో చదవొద్దని మోటివేషన్ స్పీచ్ నిపుణుడు, ఉత్తమ యువసారథి అవార్డు గ్రహీత బ్రదర్ షఫీ సూచించారు. ప్రపంచంలో కేవలం ఒకశాతం మందిమాత్రమే లక్ష్యాలను సాధిస్తున్నారని, మిగతా 99శాతం మంది కారణాలు చూపుతూ లక్ష్యసాధనను పక్కనపెడుతున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మైదానంలో గురువారం రాత్రి మైనారిటీ గురుకులాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘కీ – సక్సెస్’ సదస్సుకు ఆయన హాజరై విద్యార్థులు, నగరవాసులనుద్ధేశించి ప్రసంగించారు. సృష్టిలో అన్ని జన్మలకంటే మానవ జన్మ గొప్పదని, భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రతి వ్యక్తి నిరంతరం సాధన చేయాలన్నారు. ఈ ప్రపంచంలో విద్యతోనే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఎంతో మంది మహనీయులు నిరూపించారన్నారు. సమస్యలు ఎదురవగానే జీవితం ఇంతే అని అనుకోకూడదని, లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని సూచించారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణ నిర్మాణానికి కృషి చేస్తున్నారని, మైనారిటీ గురుకులాల ఏర్పాటు అభినందనీయమన్నారు. షఫీ కూతురు తంజీలా ప్రసంగిస్తూ నీవు చెప్పదలుచుకున్న విషయం నిజమైతే ఎవరికి భయపడవల్సిన అవసరం లేదన్నారు. సదస్సులో అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఆర్డీవో వినోద్‌కుమార్, నెడ్‌క్యాప్ చైర్మన్ అలీం, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు, మైనారిటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీస్ ఓ సోషల్ డాక్టర్
ముషీరాబాద్: శరీరంలో రుగ్మతలను డాక్టర్ నయం చేస్తే, సమాజంలో చెడును, చీడపురుగులను ఏరివేసే సోషల్ డాక్టర్ పోలీసు అని యూనివర్సల్ ఇస్లామిర్ రెసర్చ్ సెంటర్ (యూఐఆర్సీ) అధ్యక్షుడు బ్రదర్ షఫీ కొనియాడారు. మంగళవారం ముషీరాబాద్ పోలీసు స్టేషన్ సిబ్బందికి పరివర్తన, వ్యక్తిత్వ వికాసంపై ఆయేషా ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథులుగా సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, యూఆర్ఐసీ ప్రధాన కార్యదర్శి బ్ర దర్ సిరాజుల్ రహెమాన్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా షఫీ మాట్లాడుతూ పోలీసులది ఇచ్చే చేయిగా ఉండాలి తప్ప పుచ్చుకునే చేయిగా ఉండరాదని, అప్పుడే ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. తద్వారా యూనీఫాంకు మర్యాద ఉంటుందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో గంట సేపు పోలీసులు లేని సమాజం ఊహించుకోవడమే కష్టమన్నా రు. పోలీసు సంస్కృతిలో ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు. ఆకట్టుకున్న బ్రదర్ ప్రసంగం... పోలీసులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి హాజరైన యూనివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటర్ (యూఐఆర్సీ) అధ్యక్షుడు బ్రదర్ షపీ, ప్రధాన కార్యదర్శి బ్రదర్ సిరాజుల్ రెహమాన్ ప్రసంగించిన తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసలోని ప్రధాన ఘట్టాలను శాస్త్రోక్తంగా.. చూడకుండా పఠించడంతో పాటు అందులోని అర్థాలను సవివరంగా చెప్పారు. అంతేకాకుండా బైబిల్, ఖురాన్లలో దేవుని గురించి చేసిన ఒకే రకమైన వ్యాఖ్యలను వివరించారు.