పోలీస్ ఓ సోషల్ డాక్టర్
ముషీరాబాద్: శరీరంలో రుగ్మతలను డాక్టర్ నయం చేస్తే, సమాజంలో చెడును, చీడపురుగులను ఏరివేసే సోషల్ డాక్టర్ పోలీసు అని యూనివర్సల్ ఇస్లామిర్ రెసర్చ్ సెంటర్ (యూఐఆర్‌సీ) అధ్యక్షుడు బ్రదర్ షఫీ కొనియాడారు. మంగళవారం ముషీరాబాద్ పోలీసు స్టేషన్ సిబ్బందికి పరివర్తన, వ్యక్తిత్వ వికాసంపై ఆయేషా ఫంక్షన్ హాల్లో శిక్షణ ఇచ్చారు.
ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథులుగా సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ అమర్‌కాంత్‌రెడ్డి, యూఆర్‌ఐసీ ప్రధాన కార్యదర్శి బ్ర దర్ సిరాజుల్ రహెమాన్ తదితరులు హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా షఫీ మాట్లాడుతూ పోలీసులది ఇచ్చే చేయిగా ఉండాలి తప్ప పుచ్చుకునే చేయిగా ఉండరాదని, అప్పుడే ఆత్మగౌరవం పెరుగుతుందన్నారు. తద్వారా యూనీఫాంకు మర్యాద ఉంటుందన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల నేపథ్యంలో గంట సేపు పోలీసులు లేని సమాజం ఊహించుకోవడమే కష్టమన్నా రు. పోలీసు సంస్కృతిలో ప్రవర్తనలో మార్పు రావాలని కోరారు.
ఆకట్టుకున్న బ్రదర్ ప్రసంగం...
పోలీసులకు ఇచ్చే శిక్షణ కార్యక్రమానికి హాజరైన యూనివర్సల్ ఇస్లామిక్ రిసెర్చ్ సెంటర్ (యూఐఆర్‌సీ) అధ్యక్షుడు బ్రదర్ షపీ, ప్రధాన కార్యదర్శి బ్రదర్ సిరాజుల్ రెహమాన్ ప్రసంగించిన తీరు మంత్రముగ్ధుల్ని చేసింది. ఉపనిషత్తులు, మహాభారతం, రామాయణం వంటి ఇతిహాసలోని ప్రధాన ఘట్టాలను శాస్త్రోక్తంగా.. చూడకుండా పఠించడంతో పాటు అందులోని అర్థాలను సవివరంగా చెప్పారు. అంతేకాకుండా బైబిల్, ఖురాన్‌లలో దేవుని గురించి చేసిన ఒకే రకమైన వ్యాఖ్యలను వివరించారు.