బ్రూనైలో వ్యభిచారం చేస్తే రాళ్లతో కొట్టి చంపుతారు
బెగావన్: వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొట్టి చంపడం.. ఇదేదో గిరిజన ప్రాంతాల్లో అనాగరికులు పాటిస్తున్న ఆచారమనుకుంటే పొరబాటే. బ్రూనై దేశంలో ఇప్పుడిది అధికారిక శిక్షల్లో ఒకటి. ఇలాంటి పలు కఠిన శిక్షలను మంగళవారం బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారు. జాతీయ స్థాయిలో ఇలాంటి నిర్ణయం తీసుకొన్న తొలి తూర్పు ఆసియా దేశం ఇదే. కొత్త షరియా పీనల్ కోడ్ మంగళవారమే ప్రవేశపెట్టామని, దీన్ని ఆరు నెలల్లో పలు దశలుగా అమలు చేస్తామని ఆయన తెలిపారు.
ముస్లింలకు మాత్రమే వర్తించే ఈ కొత్త పీనల్ కోడ్‌లో.. వ్యభిచారానికి పాల్పడితే రాళ్లతో కొటి చంపడం, దొంగతనానికి పాల్పడితే అంగం నరికేయడం, అబార్షన్ చేయించుకోవడం లేదా మద్యం తాగడం లాంటి ఉల్లంఘనలకు బెత్తంతో తీవ్రంగా దండించడం లాంటి శిక్షలు ఉన్నాయి. ‘‘అల్లా దయతో, ఈ చట్టం అమల్లోకి వచ్చాక, అల్లా పట్ల మా బాధ్యత నెరవేరుతుంది’’ అని సుల్తాన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ కొత్త పీనల్ కోడ్‌పై హక్కుల సంఘాలు విరుచుకుపడుతున్నాయి.