కిల్లర్లకు మాజీ ఎమ్మెల్యే రూ. 51 కోట్ల నజరానా
లక్నో: పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై దాడి చేసిన వారికి బీఎస్పీ నేత, మాజీ ఎమ్మెల్యే యాకూబ్ ఖురేషి నజరానా ప్రకటించారు. దాడి చేసిన దుండగులకు ఆయన వత్తాసు పలికారు. ఈ దాడి చేసినందుకు దుండగులకు ఆయన రూ. 51 కోట్ల నగదు కానుకగా ఇస్తానని యాకూబ్ ఖురేషి గురువారం ప్రకటించారు. ముస్లింలు పరమ పవిత్రంగా ఆరాధించే మహ్మద్ ప్రవక్తను ఎవరైనా అగౌరవపరచాలని చూసే వారికి ఇదే తరహా ఘటనలే ఎదురవుతాయని ఆయన హెచ్చరించారు. మహ్మద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలు వేసిన వ్యక్తిని హతమారిస్తే రూ. 51 కోట్ల నజరానా ఇస్తానని 2006లో ఆయన ప్రకటించి... పెద్ద వివాదానికి తెరలేపారు. యాకూబ్ ఖురేషి వ్యాఖ్యలను బీఎస్పీ ఖండించింది. ఖురేషి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని పేర్కొంది.
పారిస్‌లోని ఒక వ్యంగ్య వారపత్రిక చార్లీ హెబ్డో కార్యాలయంపై బుధవారం ముగ్గురు ఉగ్రవాదులు దాడులకు తెగబడి పత్రిక ఎడిటర్ ఇన్ చీఫ్, ముగ్గురు సుప్రసిద్ధ కార్టూనిస్టులుసహా 10మంది జర్నలిస్టులను, ఇద్దరు కానిస్టేబుళ్లనూ కాల్చిచంపిన సంగతి తెలిసిందే.