అన్ని యాప్లెందుకు? బక్కర్ ఉంటే చాలు!
• ఆన్లైన్ సంస్థల రాయితీలు, కూపన్ల వివరాలందిస్తున్న బక్కర్
• బక్కర్తో ఈ-కామర్స్‌లకు నెలకు రూ.75 లక్షల వ్యాపారం
• నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరణ కూడా
• 3 నెలల్లో రూ.6 కోట్ల నిధుల సమీకరణ
• ‘స్టార్టప్ డైరీ’తో కో-ఫౌండర్ వెన్నెల మిర్యాల
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వీకెండ్స్‌లో సినిమాకి వెళ్లాలి.. థియేటర్‌కు చేరుకోవడానికో క్యాబ్ కావాలి! రిటర్న్‌లో రెస్టారెంట్లో భోజనం చేయాలి.. ఇంటికొచ్చాక ఆన్లైన్లో షాపింగూ చేసేయాలి!!
...కానీ, ఇవన్నీ తక్కువ ధరలోనే కావాలండోయ్. ఆన్లైన్లో వెతికితే వేటికవే వేర్వేరుగా రాయితీలందించే కూపన్లు దొరుకుతాయ్. కానీ, ఒక్కో దానికోసం బోలెడంత సమయం వృథా. అసలు రాయితీలందించే యాప్‌లన్నీ ఒకే వేదికగా ఉంటే!! ఆ కిక్కే వేరు కదూ...! ఇదిగో అచ్చం ఇలాంటి యాపే ‘‘బక్కర్’’. ఈ యాప్ విశేషాలు, సేవల గురించి వెన్నెల మిర్యాల ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో పంచుకున్నారు.
నేను, రవనీత్ సింగ్, నిఖార్ అగర్వాల్ ముగ్గురం ట్రిపుల్ ఐటీ గ్రాడ్యుయేట్స్. బీటెక్ నాలుగో సంవత్సరంలో ప్రాజెక్ట్ వర్క్ చేయాలి. ఏ అంశాన్ని ఎంచుకోవాలనే విషయంపై బాగా ఆలోచించాం. ఆ సమయంలో మాకెదురైన అనుభవాన్నే ప్రాజెక్ట్ చేయాలనుకున్నాం. అదే బక్కర్ యాప్‌గా మారింది. అదెలాగంటే.. మీం వీకెండ్స్‌లో ఫుడ్యాప్ల ద్వారా రాయితీలపై ఆహారాన్ని తెప్పించుకొని తినేవాళ్లం. అయితే తక్కువ ధరకు, నాణ్యమైన ఫుడ్ ఏ సంస్థ ఆఫర్ చేస్తుందోనని తెలుసుకునేందుకు ఆన్లైన్లో గంటల కొద్దీ వెతికేవాళ్లం.
ఆ సమయంలో మేం గ్రహించిందేంటంటే.. ఆన్లైన్లో రాయితీలను వెతికేందుకు ఎంత సమయం వృథా అవుతుందోనని! ‘‘ప్రతీ సంస్థకూ ఓ యాప్ ఉంటుంది.. రాయితీలూ ఉంటాయ్’’ కానీ, అవన్నీ ఒకే వేదికగా అందుబాటులో లేవని కూడా తెలిసింది. దీన్నే వ్యాపార సూత్రంగా మలుచుకొని రూ.2 లక్షల పెట్టుబడితో హైదరాబాద్ కేంద్రంగా గతేడాది డిసెంబర్లో క్రూగ్జియో ల్యాబ్స్ ప్రై.లి. పేరిట సంస్థను ప్రారంభించాం. ఈ సంస్థ ఆండ్రాయిడ్ యాపే ‘బక్కర్’! వినియోగదారులకు లాభపడేలా.. కంపెనీలకు తగిన మార్కెట్ చూపించేలా వివిధ సంస్థల యాప్‌లు, వాటికి ప్రత్యామ్నాయాలు, రాయితీలు, డిస్కౌంట్లు, ఆఫర్లనూ అందించే సంస్థలు.. ఇలా అన్నింటికీ ఒకే వేదికగా పొందే వీలు కల్పించడమే బక్కర్ పని.
4 విభాగాలు.. 22 సంస్థలు..
బక్కర్ యాప్‌లో లాగినయ్యాక.. కావాల్సిన సేవలను ఎంచుకోవాలి. వెంటనే ఆయా సేవలందిస్తున్న సంస్థలు, ధరలు, రాయితీల వివరాలొస్తాయి. నేరుగా అక్కడి నుంచే వాటిని బుకింగ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం క్యాబ్స్, ఈ-కామర్స్, విమానాలు, కూపన్లు... నాలుగు విభాగాల్లో సేవలందిస్తున్నాం. ఫుడ్‌పాండా, స్విగ్గీస్, సాసోస్, ఓలా, ఉబర్, పేటీఎం, మొబీక్విక్, ఫ్రీచార్జ్, గ్రాబ్ఆన్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి 22 సంస్థలు మాతో భాగస్వామ్యమయ్యాయి. నెలకు 50 వేల మంది బక్కర్ను వినియోగించుకుంటున్నారు. వచ్చే 6 నెలల్లో 5 లక్షల యూజర్లకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మా యాప్ నుంచి జరిగే ప్రతి కొనుగోలు మీద 7-10 శాతం కమీషన్ కింద ఆయా సంస్థలు చెల్లిస్తాయి.
నెలకు రూ.75 లక్షల జీఎంవీ..
ప్రస్తుతం నెలకు రూ.9-10 లక్షల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. బక్కర్ ద్వారా మా భాగస్వామ్య సంస్థలకు నెలకు రూ.75-80 లక్షల వ్యాపారం (జీఎంవీ) జరుగుతుంది. ఆగస్టులో రెండింతల వృద్ధిని చేరుకోవాలనేది లక్ష్యం. ప్రస్తుతం మా సంస్థలో ఆరుగురు ఉద్యోగులున్నారు. నెల రోజుల్లో లోకల్ షాపింగ్, రీచార్జ్ విభాగాల్లోకి విస్తరించనున్నాం. 6 నెలల్లో హోటల్స్, ట్రావెల్ (బస్సు, రైళ్లు) విభాగాలకు విస్తరించాలనేది లక్ష్యం.
రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టి..
‘‘సీడ్రౌండ్లో భాగంగా గతేడాది డిసెంబర్లో కోటి రూపాయల నిధులను సమీకరించాం. 50కే వెంచర్స్, సింగపూర్, సిలికాన్‌వ్యాలీకి చెందిన ఇన్వెస్టర్లు ఈ పెట్టుబడులు పెట్టారు. ప్రస్తుతం రూ.6 కోట్ల నిధుల సమీకరణపై దృష్టిపెట్టాం. బెంగళూరు, ముంబైకి చెందిన పలువురు వీసీ)సంస్థలతో మాట్లాడుతున్నాం. మరో 3 నెలల్లో డీల్‌ను క్లోజ్ చేస్తాం’’ అని వెన్నెల వివరించారు.