భావోద్వేగాల భోజనం
బౌద్ధ వాణి
బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు.
ఓ గృహస్థు ఒకనాడు గౌతమ బుద్ధుడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు. బుద్ధుడు వెళ్లాడు. వెళ్లాక ఆయనకు తెలిసింది ఏమిటంటే ఆ గృహస్థు తనను పిలిచింది భోజనానికి కాదనీ, తనను విమర్శించడానికి, దూషించడానికి అని అర్థమైంది. బుద్ధుడు అతడి తిట్లన్నీ భరించాడు. అతడి ఆరోపణలనన్నింటినీ భరించాడు. అతడి విమర్శలన్నిటికీ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చాడు. అయినప్పటికీ ఆ గృహస్థు బుద్ధుడిని దూషించడం మానలేదు.
చివరికి బుద్ధుడు అడిగాడు, ‘‘మిత్రమా... నీ ఇంటికి తరచు భోజన సందర్శకులు వస్తుంటారా?’’
‘‘అవును. వస్తుంటారు’’ అని చెప్పాడు గృహస్థు.
‘‘వారి కోసం నువ్వు ఏమి సిద్ధం చేస్తుంటావు?’’
‘‘పెద్ద విందునే సిద్ధం చేస్తాను’’
‘‘ఒకవేళ భోజనానికి వస్తానన్న వారు చివరి నిమిషంలో రాకపోతే, వారి కోసం వండించిన పదార్థాల మాటేమిటి?’’
‘‘ఏముందీ, మేమే భుజిస్తాం’’ అన్నాడు గృహస్థు.
‘‘సరే, నువ్వు నన్ను భోజనానికి పిలిచావు. కానీ తిట్లు, పరుష పదాలు వడ్డించావు. అంటే నువ్వు నాకోసం సిద్ధం చేసిన పదార్థాలు దూషణలు, విమర్శలు మాత్రమే. కానీ వాటిని నేను తినదలచుకోలేదు. కాబట్టి నువ్వే వాటిని స్వీకరించు’’ అని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు బుద్ధుడు.
చూడండి, ఇక్కడ బుద్ధుడు ఏం చేశాడో! మాటకు మాట అనకుండా, ప్రతి విమర్శలు చెయ్యకుండా, అసలు కోపానికే తావివ్వకుండా, తనకు రావలసిన కోపాన్ని ఆ గృహస్థుకే తిరిగి ఇచ్చేశాడు. అంటే బుద్ధుడు కోపానికి, ఆవేశానికి, ఆగ్రహానికి లోనవలేదు. పెపైచ్చు ఎంతో శాంతంగా మాట్లాడి ఆ భావోద్వేగాల భోజనాన్ని గృహస్థునే భుజించమని చెప్పి వెళ్లాడు.
ఇదంతా గమనించిన శిష్యులకు బుద్ధుడు ఇలా చెప్పాడు.
‘‘ఎప్పుడూ కూడా, ఎవరి మీద కూడా ప్రతీకారం తీర్చుకోకండి. ద్వేషం అనేది ద్వేషంతో చల్లారకపోగా, మరింత ద్వేషానికి దారి తీస్తుంది’’.
మనం కూడా జీవితంలో ఇలాంటి అకారణ దూషణలకు, విమర్శలకు గురవుతుంటాం. కొన్ని మాటలు మరీ కఠినంగా, హృదయాన్ని బాధించే విధంగా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం కోపంతో ఊగిపోకూడదు. ఒకటికి రెండు తిట్లు తిట్టి అవతలి వారి కన్నా దిగజారి పోకూడదు. మనలోని ఆవేశాన్ని, ఆగ్రహాన్ని రెచ్చగొట్టేందుకు అవతలి వ్యక్తులు చేసే ప్రయత్నాలను సఫలం కానీయకూడదు. అప్పుడేం జరుగుతుంది? వాళ్ల మాటలు తిరిగి వాళ్లకే తగులుతాయి.
వాళ్ల కోపం తిరిగి వారినే చేరుతుంది. మనం స్వీకరిస్తేనే కదా వారి నుంచి మనకు వచ్చేది. ఆ ‘బహుమతి’ని మనం ఎందుకు తీసుకోవడం? వాళ్ల దగ్గరే ఉండనిద్దాం. మనం మౌనంగా, మనశ్శాంతిగా ఉందాం. చివరికి వారే తెలుసుకుంటారు, తమ వల్ల జరిగిన తప్పేమిటో! ఇసుమంత కూడా కోపం తెచ్చుకోని మన వ్యక్తిత్వాన్ని వారు గౌరవించి తీరుతారు.
అయితే మరీ మౌనంగా ఉండిపోతే వారు తమ విమర్శలు సరైనవేనని నమ్మే ప్రమాదం ఉంది. మనలో తప్పు ఉంది కాబట్టే మనం మౌనంగా ఉండిపోయామని అనుకునే అవకాశమూ ఉంది. అందుకే వారిని సహనంగా అడగాలి, ‘‘మీ మాటల్లో వాస్తవముందా?’’ అని అడగాలి. ఒకవేళ వాళ్ల వైపు నుండి వాస్తవం ఉన్నట్లయితే అప్పుడు మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేయాలి.
వాస్తవం లేనట్లయితే సహజంగానే మనకు కోపం వస్తుంది. అప్పుడు వాదించీ, వారించీ లాభం లేదు. వాళ్ల మాటల్లోని కోపాన్ని మనలోకీ తెచ్చుకుని అరచి, ఆగ్రహం చెందీ ప్రయోజనం లేదు. ప్రశాంతతతో కూడిన చిరునవ్వుతోనే మనం అలాంటి వారికి అడ్డుకట్ట వెయ్యాలి. సాధారణంగా ఆధ్యాత్మిక లక్ష్యాలను సాధించే ప్రయత్నంలో ఇలాంటి మౌనమే మనకు తోడ్పడుతుంది.