పరుగుల వీరుడు బుదియా సింగ్ ఎక్కడ?
భువనేశ్వర్: మూడేళ్ల కే మారథాన్ పరుగు.. నాలుగేళ్ల వయసులోనే 40 మైళ్లు పరిగెత్తిన రికార్డు .. అతి చిన్న వయసులో ఏకంగా 48 మారథాన్లు పూర్తిచేసి చరిత్ర సృష్టించిన పరుగుల (వీరుడు) బుడతడు.. ఒడిశా వండర్ కిడ్ బుదియా సింగ్ నెలరోజులుగా ఎక్కడున్నాడో ఆచూకీ లేదు. బుదియా సింగ్ మిస్సింగ్ పై తమకు నివేదిక ఇవ్వాలని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) ఒడిశా ప్రభుత్వాన్ని ఆదేశించింది.
బుదియా సింగ్ స్పోర్ట్స్ హాస్టల్ లో ఉంటున్నాడు. ఆచూకీ లేకుండా పోయిన బుదియా గురించి తీసుకున్న చర్యలు ఏమటి? పోలీసులకు ఫిర్యాదు చేశారా? అనే విషయంపై మూడు రోజుల్లోగా తమకు నివేదిక సమర్పించాలని స్పోర్ట్స్ హాస్టల్ ఇంచార్జ్ ని సీడబ్ల్యూసీ సభ్యుడు బెనుధర్ సేనాపతి ఆదేశించారు. సీడబ్ల్యూసీ కృషి వల్లనే బుదియా కళింగ స్టేడియంలోని స్పోర్ట్స్ హాస్టల్లో ఉంటున్నాడని సేనాపతి తెలిపారు. మే 10న వేసవి సెలవులకి తన తల్లి దగ్గరికి వెళ్లిన బుదియా ఇప్పటివరకు స్పోర్ట్స్ హాస్టల్ కు రాలేదు.