కట్టు కథలు చెప్పవద్దు..!
- ప్రజల దాహార్తి తీర్చండి
- అధికారులపై ఎమ్మెగ్యే గుమ్మనూరు ఆగ్రహం
ఆలూరు: ‘‘ కట్టు కథలు చెప్పకుండా పల్లె ప్రజలకు గుక్కెడు తాగునీటిని అందించండి’’ అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. స్థానిక ఆర్అండ్బీ అథితిగృహం ఆవరణంలో గురువారం ఆలూరు సబ్ డివిజన్ ఆర్డబ్ల్యూఎస్ డీఈ, జేఈలతో ఆయన సమావేశమైయ్యారు. నియోజకవర్గంలోని చాలా గ్రామాల్లో తాగునీరు దొరకడం లేదని.. ప్రజలు మైళ్ల దూరం వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. టీడీపీ నాయకులు..తాగునీటి సమస్య తీర్చకుండా పత్రికల్లో ఫొటోల కోసం.. చలివేంద్రాలను ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. కర్నూలు ఎంపీ బుట్టారేణుక..ఆలూరు నియోజకవర్గంలో 200 పైగా బోర్లును తవ్వించారన్నారు. ఎస్ఎస్ ట్యాంకుల నిర్వహణ పేరుతో టీడీపీ నాయకులు డబ్బులు దండు కోవడం తప్ప చేసింది ఏమీ లేదన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నీటి సమస్యను పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈ మొహిద్దీన్, జేఈలు బాలచంద్రాచారి, విఘ్ణవర్ధన్ రెడ్డి, రాంనేలా తదితరులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు వేతనాలు చెల్లించండి
ఉపాధి కూలీలకు వెంటనే వేతనాలు చెల్లించాని అధికారులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సూచించారు. వేతనాలను చెల్లించక పోవడంతో కూలీలు పస్తులతో కాలం గడుపుతున్నారన్నారు. వేతనాలపై త్వరలో డ్వామా పీడీ పుల్లారెడ్డితో చర్చిస్తానని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం చెప్పారు.