శశిరేఖా పరిచయం
ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు. ఈ ఫార్ములా మన బుల్లితెర శశిరేఖకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. శశిరేఖా పరిణయం సీరియల్‌తో ఈ ముద్దుగుమ్మకు ఏడాది కిందట భాగ్యనగరితో ముడిపడింది. మైసూరులో పుట్టి పెరిగిన మేఘనా లోకేశ్.. కన్నడ సీమలో సత్తా చాటి తెలుగింటికి చే రుకుంది. హైదరాబాద్ పరిచయమై ఏడాదే అయినా.. అనుబంధం మాత్రం ఎంతో ఘనమైందని చెబుతోంది. సిటీతో తనకున్న పరిచయాన్ని ‘సిటీ ప్లస్’తో పంచుకుంది.
- మేఘనా లోకేశ్, టీవీ నటి
మాది మైసూరు. మా నాన్న ఇంజనీర్‌గా పనిచేశారు. మా అమ్మ లెక్చరర్‌గా వర్క్ చేసింది. నా స్కూలింగ్ అంతా మైసూరులోనే. ఎనిమిదేళ్ల వయసు నుంచే నాటకాల్లో పాల్గొనేదాన్ని. అలా మొదలైన నా నటప్రస్థానం కన్నడ సీరియల్స్ దాటి.. తెలుగువారి ముందుకు తెచ్చింది. అన్నపూర్ణ బ్యానర్‌పై శశిరేఖా పరిణయం సీరియల్లో లీడ్ రోల్ పోషించే చాన్స్ వచ్చింది. దాంతో హైదరాబాద్‌కు వచ్చేశాను.
చిన్నప్పటి నుంచీ అంతే..
స్కూల్‌కు చాలా ఇష్టంగా వెళ్లేదాన్ని. బాగా చదివేదాన్ని కూడా. అయితే అలా లాస్ట్ బెల్ కొట్టగానే ఇలా బ్యాగ్ సర్దేసేదాన్ని. హోమ్‌వర్క్ కూడా అస్సలు చేసేదాన్ని కాదు. ఎంతసేపు.. ఆటలు, పాటలు, కల్చరల్ యాక్టివిటీస్..! వీటి మీదే ఇంట్రెస్ట్ చూపేదాన్ని. నాటకాలంటే ఇష్టమే కానీ, నటినవ్వాలని ఎన్నడూ అనుకోలేదు. చదువుకునే రోజుల్లో ఏ టీచర్నో.. లెక్చరర్నో కావాలనుకున్నాను. నాకో అన్నయ్య ఉన్నాడు. తను చదువుల్లో పర్ఫెక్ట్. నేను చేసే అల్లరి పనులు తన కంటబడితే.. వెంటనే ఇంట్లో వాళ్లకు కంప్లయింట్ చేసేవాడు.
దసరా సరదా భలే..
శశిరేఖా పరిణయం సీరియల్లో నటించడం కోసం మొదటిసారి నేను హైదరాబాద్ వచ్చాను. మైసూరుతో పోలిస్తే హైదరాబాద్ వెరీ డిఫరెంట్ సిటీ. నాకైతే మైసూర్, బెంగళూర్ కలగలిస్తే హైదరాబాద్‌లా ఉంటుందనిపించింది. కొత్త ప్లేస్ అయినా చాలా కంఫర్ట్‌గా ఫీలయ్యాను. ఇక్కడి కల్చర్ చాలా గొప్పగా అనిపించింది. ఇన్నేళ్లూ దసరా పండుగ మైసూరులోనే ఘనంగా జరుగుతుందని అనుకునేదాన్ని. కానీ, భాగ్యనగరంలో కూడా ఈ ఫెస్టివల్ ఇంత సంబరంగా చేస్తారని ఇప్పుడే తెలిసింది. మెట్రో కల్చర్‌కు అలవాటుపడిన సిటీలో బతుకమ్మ పాటలు, దాండియా ఆటలు నన్ను అబ్బురపరిచాయి. పదహారణాల తెలుగందం ఎలా ఉంటుందో బతుకమ్మ ఫెస్టివల్లో చూశాను. చీరలు, పట్టు పరికిణీలు.. నగలు.. పూలు.. అమ్మాయిలందరూ కలర్ఫుల్గా కనిపించారు. బతుకమ్మ పండుగను నేను కూడా ఫుల్‌గా ఎంజాయ్ చేశాను. నేను సిటీకి వచ్చి ఏడాదే అయినా.. ఇక్కడి కల్చర్‌కు ఎడిక్ట్ అయిపోయాను. హైదరాబాద్ నాకు రెండో పుట్టిల్లులా అనిపిస్తుంటుంది.
సిటీ చుట్టేస్తా..
నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మే. తీరిక దొరికితే అమ్మతో కలసి సిటీ చుట్టేస్తుంటాను. మొదటిసారి చార్మినార్ చూసినపుడు చాలా హ్యాపీగా ఫీలయ్యాను. ఇక అక్కడ షాపింగ్ చేస్తుంటే అస్సలు టైం తెలియదు. రాత్రి వేళల్లో రంగురంగుల విద్యుత్ దీపకాంతుల్లో మెరిసిపోయే బిర్లామందిర్ సూపర్బ్‌గా ఉంటుంది. బంజారాహిల్స్, రోడ్ నంబర్ 12 లోని జగన్నాథస్వామి ఆలయానికి కూడా తరుచూ వెళ్తుంటాను.
తొందర్లోనే వండేస్తా..
రుచుల విషయానికి వస్తే.. హైదరాబాదీ వంటకాలు స్పైసీగా.. టేస్టీగా భలే ఉంటాయి. బిర్యానీ అంటే నాకు చాలా ఇష్టం. కిచెన్ ఆఫ్ కూచిపూడి రెస్టారెంట్లో నాలుగైదు రకాల వెరైటీ బిర్యానీలు టేస్ట్ చేశాను. అంతేకాదు.. నిజామీ ఫ్లేవర్ ఉన్న వంటకాల గురించి నెట్లో సెర్చ్ చేస్తున్నాను. బుక్స్ చదివి మరీ ఆ ఘుమఘుమల గురించి తెలుసుకుంటున్నాను. తొందర్లోనే ఆ వెరైటీలు వండేస్తాను కూడా.
- శిరీష చల్లపల్లి