బెల్లంపల్లిలో బంద్ ప్రశాంతం
బెల్లంపల్లి: నెన్నెలకు చెందిన రామాగౌడ్ ఆత్మహత్యకు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం ప్రతిపక్షాలు తలపెట్టిన బంద్ బెల్లంపల్లిలో ప్రశాంతంగా ముగిసింది. బంద్‌ను విజయవంతం చేయడానికి
కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, టీడీపీ శ్రేణులు తెల్లవారుజామునే రోడ్డెక్కారు. వీరిని వన్‌టౌన్ పోలీసులు అనుసరించారు. దుకాణాలు బంద్ పెట్టాలని ప్రతిపక్షాల నాయకులు బజార్ ఏరియా ప్రాంతంలో ప్రచారం
చేస్తుండగా వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.నాగరాజు సిబ్బందితో అక్కడికి చేరుకుని ముందస్తుగా అరెస్టు చేశారు. చిలుముల శంకర్, రాజలింగు(కాంగ్రెస్), కొయ్యల ఏమాజీ, కుసుమ భాస్కర్, సోమశేఖర్,
సత్యనారాయణరెడ్డి (బీజేపీ), మంతెన మల్లేష్, బొంతల లక్ష్మీనారాయణ, తాళ్లపల్లి మల్లయ్య, గుండా నగేష్ (సీపీఐ), ఎండి.గౌస్ తదితరులను బలవంతంగా జీపులో ఎక్కించుకుని వన్‌టౌన్‌కు తరలించారు.
తెరిపించేందుకు టీఆర్ఎస్ యత్నం..
ప్రతిపక్ష నాయకులు మూసివేయించిన దుకాణాలను టీఆర్ఎస్ శ్రేణులు కొంతమంది తెరిపించేందుకు యత్నించడం కనిపించింది. బంద్‌లో పాల్గొనవద్దని ప్రచారం చేశారు. సమాచారం తెలుసుకున్న విపక్ష
నాయకులు ఎస్‌హెచ్‌వోను ప్రశ్నించారు. దీంతో ఎస్‌హెచ్‌వో బజారు ఏరియాకు చేరుకుని నిలువరించారు. వ్యాపారులను దుకాణాలు తెరవాలని బలవంతం చేస్తే అరెస్టు చేస్తామని టీఆర్ఎస్ శ్రేణులను
హెచ్చరించారు. అనంతరం టీఆర్ఎస్ శ్రేణులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఓ ప్రక్క ప్రతిపక్ష సభ్యుల బంద్ ప్రచారం, మరోవైపు టీఆర్ఎస్ శ్రేణుల వ్యతిరేక ప్రచారంతో బజారు ఏరియాలో కొద్దిసేపు ఉద్రిక్త
పరిస్థితులు కనిపించాయి. స్టేషన్‌కు తరలించిన నాయకులను పోలీసులు మధ్యాహ్నం విడిచిపెట్టారు.