కెన్యా కాల్పుల్లో భారతీయ బాలుడు మృతి
కెన్యా రాజధాని నైరోబీలో వెస్ట్గేట్ మాల్‌పై తీవ్రవాదుల దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిదేళ్ల బాలుడు పరాంశ్జైన్ మరణించాడని అతడి బంధువులు మంగళవారం లక్నోలో వెల్లడించారు. ఆ ఘటనలో పరాంశ్ తల్లి ముక్తా, సోదరి పూర్వీలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఆ ఘటన తమ కుటుంబ సభ్యులను తీవ్రంగా కలచివేసిందని తెలిపారు. మనోజ్ కుటుంబంతో పాటు షాపింగ్‌మాల్‌కు వెళ్లిన బ్యాంక్ ఉద్యోగి మరణించిందని, వారి కారు డ్రైవర్ ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని చెప్పారు.
పరాంశ్ జైన్ తండ్రి మనోజ్ కుమార్ జైన్ నైరోబీలోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. బుందేల్‌ఖండ్‌లోని లలిత్‌పూర్‌కు చెందిన వారి కుటుంబం కొన్ని సంవత్సరాల క్రితం ఇండోర్‌లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖ నుంచి నైరోబీలోని బరోడా శాఖకు బదిలీపై వెళ్లారని చెప్పారు. గత రెండునెలల క్రితమే మనోజ్ కుమార్‌కు పదోన్నతి లభించిందన్నారు.