బిహార్ వరదలకు మరో 19 మంది బలి
న్యూఢిల్లీ: బిహార్‌లో వరదల ప్రకోపం కొనసాగుతోంది. మరో 19 మంది చనిపోవడంతో ఈ సీజన్లో మొత్తం మృతుల సంఖ్య 198కి చేరింది. తాజా మరణాల్లో పట్నాలో గరిష్టంగా 10 , శరణ్‌లో ఆరు, లఖిసరాయ్, సమస్తిపూర్, బెగుసరాయ్‌లో ఒక్కొక్కటి చొప్పున సంభవించాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటించింది.
గంగాతో పాటు ఇతర నదులు సోన్, పున్పున్, బుర్హి గండక్, గాంగ్రా,కోసి ఉప్పొంగటమే వరదలకు కారణమని భావిస్తున్నారు. 12 జిల్లాల్లోని సుమారు 41.90 లక్షల మంది వరదలకు ప్రభావితమయ్యారు. 7 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దిఘా ఘాట్, గాంధీ ఘాట్, బక్సార్, హతిదా ఘాట్‌లో గంగా ఉధృతి తగ్గుముఖం పడుతున్నట్లు బిహార్ నీటి వనరుల శాఖ తెలిపింది.
ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు కురిశాయి. హిమాచల్‌ప్రదేశ్‌లోని ఎగువ ప్రాంతాల్లో స్వల్పంగా మంచు పడింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అమృత్‌సర్‌లో 32.5 డిగ్రీలు, అంబాలలో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.