సినిమాకు వెళ్తే ఇల్లు దోచేశారు
కాటేదాన్(హైదరాబాద్ సిటీ): యజమానులు సినిమాకు వెళ్తే దొంగలు ఇంట్లోకి చొరబడి 50 తులాల బంగారం చోరీ చేశారు. సొత్తుతో పారిపోతున్న దొంగల్లో ఒకడిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... బుద్వేల్ రైల్వ్స్టేషన్ ప్రాంతంలో నివాసం ఉండే రమేష్ గుప్తా వ్యాపారి. శనివారం రాత్రి ఇంటికి తాళం వే సి కుటుంబసభ్యలతో కలిసి 9 గంటలకు సినిమాకు వెళ్లారు. ఇది గ్రహించిన ముగ్గురు దొంగలు తాళం పగులగొట్టి గుప్తా ఇంట్లోకి చొరబడ్డారు. అల్మారా పగులగొట్టి అందులో దాచిన 50 తులాల బంగారు నగలు మూటగట్టుకున్నారు. గుప్తా ఇంట్లో అలికిడి కావడంతో స్థానికులు వచ్చి ఇంట్లో ఎవరున్నార ని ప్రశ్నించారు.
ఎలాంటి సమాధానం రాకపోవడంతో మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొద్దిసేపటికి ముగ్గురు దొంగలు ఇంట్లోంచి చోరీ సొత్తుతో బయటకు పరుగుపెట్టారు. స్థానికులు వెంబడించి దొంగల్లో ఒకడిని పట్టుకున్నారు. అంతలోనే అక్కడికి చేరుకున్న పోలీసులకు వారిని అప్పగించారు. పారిపోయిన దొంగల వద్దే సొత్తు ఉందని పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ దొంగను పోలీసులు విచారించగా.. వీరిది ఉత్తరప్రదేశ్ అని, స్థానిక పరిశ్రమలో పని చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారని తేలింది. ఘటనా స్థలాన్ని ఆదివారం ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మాజీ కార్పొరేటర్ ప్రేమ్‌దాస్‌గౌడ్ పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.