కార్మికుల కష్టంతోనే ఆర్టీసీ లాభాల్లోకి: చైర్మన్
మియాపూర్ (హైదరాబాద్) : కార్మికులు కష్టపడి పనిచేసినప్పుడే ఆ సంస్థ లాభాల బాట పడుతుందని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం మియాపూర్‌లోని బస్‌బాడీ యూనిట్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కార్మికుల సమస్యలను, పనితీరును అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ ఆర్టీసీ రూ.202 కోట్ల అప్పుల్లో ఉందని, కార్మికులు సమష్టిగా కష్టించి పనిచేసి లాభాలవైపు గట్టెక్కించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రతీ గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఆర్టీసీకి 400 బస్సులు అవసరం ఉందని, ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ రవీందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.