త్రుటిలో తప్పిన ప్రమాదం
ఓవర్టేక్ చేయబోయి ఆర్టీసీ బస్సు బోల్తా
ఎన్.హనుమాపురంలో ఘటన..
పలువురికి స్వల్ప గాయాలు
ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను తప్పించేందుకని ముందు వెళుతున్న బైక్‌ను ఓవర్టేక్ చేయబోయిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రాణాపాయం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కణేకల్లు మండలం ఎన్.హనుమాపురం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది.
- కణేకల్లు (రాయదుర్గం)
ఉరవకొండ డిపోకు చెందిన ఏపీ29జెడ్ 0346 నంబరుగల ఆర్టీసీ బస్సు మంగళవారం ఉదయం 22 మంది ప్రయాణికులతో ఉరవకొండ నుంచి రాయదుర్గం బయల్దేరింది. కణేకల్లు మండలం ఎన్.హనుమాపురంలో 25 మంది విద్యార్థులు మాల్యం జెడ్పీ హైస్కూలుకెళ్లేందుకు బస్సు ఎక్కారు. వీరితో మరో ఇద్దరు మహిళలు కూడా బస్సెక్కారు. బస్ స్టాప్ దాటి కొంతదూరం వెళ్లాక ముందువైపు ద్విచక్రవాహనం వెళుతుండగా, ఎదురుగా టిప్పర్ వాహనం వస్తోంది. సింగిల్ రోడ్డు కావడంతో టిప్పర్‌కు సైడ్ ఇచ్చేందుకని ద్విచక్రవాహనం ఓవర్టేక్ చేసేందుకు ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఇస్మాయిల్ కుడివైపునకు స్టీరింగ్ తిప్పాడు.
అయితే స్టీరింగ్ రాడ్ స్ట్రక్ కావడంతో పూర్తిగా కుడివైపునకు దూసుకుపోయింది. స్టీరింగ్‌ను సరిచేసేందుకు డ్రైవర్ ఎంత ప్రయత్నించినా కాకపోవడంతో రోడ్డుపక్కన ఐదు అడుగుల లోతులోకి బోల్తాపడింది. దిగువభాగంలోని ముళ్లకంపలపైకి బస్సు ఒరిగింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు సంఘటన స్థలానికి చేరుకుని నిచ్చెనలు వేసి.. బస్సులోని ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. పలువురికి స్వల్ప గాయాలు తగిలాయి. ప్రాణనష్టం తప్పడంతో అందరూ ఊపీరి పీల్చుకున్నారు. 104 వాహన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన డ్రైవర్ ఇస్మాయిల్, కండక్టర్ వెంకటరాముడు, ప్రయాణికులు లక్ష్మిదేవి (45), అంజినమ్మ, విద్యార్థులు లోకేష్, సరోజ, బేబీతోపాటు పలువురికి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం 108 వాహనంలో ఉరవకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స చేయించుకొని ప్రయాణికులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.